2.0.. తెలుగు డీల్ అయిపోయింది

2.0.. తెలుగు డీల్ అయిపోయింది

‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థే శంకర్-రజినీకాంత్‌ల మాగ్నమ్ ఓపస్ ‘2.0’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతుండటం విశేషం. విడుదలకు ఆరు నెలల ముందే ‘2.0’ తెలుగు హక్కుల డీల్ పూర్తయింది.

సునీల్ నారంగ్ నేతృత్వంలోని గ్లోబల్ సినిమాస్ భాగస్వామ్యంతో తెలుగులో ‘2.0’ను విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్సన్స్’ ప్రకటించింది. భారీ ధరకు ‘2.0’ను అమ్మినట్లు లైకా అధినేత రాజు మహాలింగం ట్విట్టర్లో వెల్లడించాడు. ఆ రేటు ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఐతే ఈ డీల్ రూ.60 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

రజినీకాంత్ చివరి సినిమా ‘కబాలి’ని తెలుగులో దాదాపు రూ.32 కోట్లకు అమ్మారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ ప్రభావం ‘2.0’ మీద ఏమీ పడలేదు. ఎందుకంటే దీని మీద ఉన్న అంచనాలే వేరు. ఇది శంకర్ సినిమా ఆయె. అందులోనూ ‘రోబో’ తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ‘2.0’ మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది కూడా ‘బాహుబలి: ది కంక్లూజన్’ తరహాలోనే ప్రకంపనలు సృష్టిస్తుందని.. అనూహ్యమైన వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

అందుకే విడుదలకు ఆర్నెల్ల ముందే బిజినెస్ దాదాపుగా పూర్తి కావస్తోందని చెబుతున్నారు. తెలుగు వెర్షన్‌కు రూ.60 కోట్లన్నది భారీగా అనిపించొచ్చు కానీ.. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఆ మొత్తాన్ని వసూలు చేయడం పెద్ద విషయం కాదు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు