అతి పెద్ద పరీక్ష అతడికే...

అతి పెద్ద పరీక్ష అతడికే...

శుక్రవారం ఒకే రోజు ఒకటికి మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సినిమాల విజయం అందరికీ కీలకమే. ప్రతి ఒక్కరూ తమ సినిమా హిట్టవ్వాలనే ఆశిస్తారు. ఐతే ఈ మూడు సినిమాల్లో భాగమైన వాళ్లలో అందరికంటే ఎక్కువగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఒకరున్నారు. ఆ వ్యక్తికి ఈ సినిమా హిట్టవడం చాలా చాలా కీలకం. ఇది తేడా వస్తే ఆ వ్యక్తి కెరీరే ప్రశ్నార్థకంలో పడుతుంది. అంతటితో కెరీర్ ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. తేజ.

‘జయ జానకి నాయక’ సినిమా తేడా కొడితే బోయపాటి.. ‘లై’ సినిమా ఆడకపోతే హను రాఘవపూడి ఉన్నపళంగా ప్రమాదంలో పడిపోరు. ఆయా చిత్రాల హీరో హీరోయిన్లు నిర్మాతలకు కూడా పెద్ద ముప్పేమీ లేదు. ‘నేనే రాజు నేనే మంత్రి’ హీరో హీరోయిన్లకు.. నిర్మాతలకు కూడా పెద్ద ఇబ్బందేమీ లేదు. కానీ ఈ సినిమా ఆడకపోతే తేజకే చాలా చాలా కష్టమైపోతుంది. దశాబ్దంన్నర హిట్టు ముఖం చూడలేదు తేజ. ఆయన చివరి సినిమా ‘హోరాహోరి’ చూశాక తన మీద ప్రేక్షకులకు పూర్తిగా నమ్మకం కోల్పోయింది.

ఆ స్థితిలో తేజ కొత్త సినిమా మీద జనాలకు ఆసక్తే లేదు. కానీ అనుకోకుండా రానాతో సినిమా సెట్టవడం తేజకు కలిసొచ్చింది. ఇతకుముందు తీసిన సినిమాలకు భిన్నమైన ప్రయత్నం చేయడం.. ప్రోమోస్ బాగుండటం.. పబ్లిసిటీ పెద్ద ఎత్తున చేయడంతో ‘నేనే రాజు నేనే మంత్రి’కి క్రేజ్ అయితే బాగానే వచ్చింది. ఈ క్రేజ్ ను సినిమా ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుందన్నదే చూడాలి. సినిమా అంచనాల్ని అందుకుంటే తేజ కంటే సంతోషించేవాడు ఇంకొకడు ఉండడు. ఆయన కెరీర్‌కు ఇది పునరుజ్జీవమే. కానీ తేడా వస్తే మాత్రం అంతే సంగతులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English