ఆ హీరో సినిమా.. అన్నీ ఓవరే

ఆ హీరో సినిమా.. అన్నీ ఓవరే


తమిళ వివాదాస్పద హీరో శింబు నటుడే కాదు.. రచయిత, దర్శకుడు కూడా. అతను తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘మన్మథన్’కు కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఆ తర్వాత సొంతంగా మెగా ఫోన్ పట్టి ‘వల్లభన్’ తీశాడు. ఇప్పుడు దర్శకుడిగా మరో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా గురించి రోజుకో సంచలన ప్రకటన చేస్తున్నాడు శింబు.

కొన్ని రోజుల కిందట ఈ సినిమా గురించి ప్రకటన చేస్తూ.. ఈ చిత్రంలో పాటలుండవని.. ఇంటర్వెల్ ఉండదని అన్నాడు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తాడని ప్రకటించడమూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే స్క్రిప్టు చూసే సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.. మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేసినట్లు తెలిపాడు శింబు.

ఇక తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే తెరకెక్కుతుందట. ఇది పూర్తి స్థాయి ఇంగ్లిష్ సినిమా అట. కాకపోతే ఇంగ్లిష్‌లో తీశాక దాన్ని తమిళం, తెలుగులోకి అనువాదం చేస్తారట. ఒరిజినల్ వెర్షన్‌కు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మాటలు రాస్తాడట. ఆ పని కూడా పూర్తయిపోయిందట. గౌతమ్.. శింబును హీరోగా పెట్టి ‘విన్నైతాండి వరువాయ’ (ఏమాయ చేసావె), ‘అచ్చం ఎన్బదు మదమాయడ’ (సాహసం శ్వాసగా సాగిపో) సినిమాలు చేశాడు. ఆ పరిచయంతోనే శింబు కొత్త సినిమాకు డైలాగులు రాస్తున్నాడు. శింబు హిట్టు కొట్టి చాలా కాలమైంది.

దర్శకుడిగా అతను పెద్దగా రుజువు చేసుకున్నది లేదు. ఇలాంటి సమయంలో అతను ఇంగ్లిష్ సినిమా తీయడమేంటో.. అతణ్ని నమ్మి పేరున్న టెక్నీషియన్లు సహకారం అందించడమేంటో జనాలకు అర్థం కావడం లేదు. ఈ సినిమాకు సంబంధించి శింబు చెబుతున్న వివరాలన్నీ కొంచెం ఓవర్‌గానే అనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు