కాజ‌ల్‌కు మ‌ద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ‌

కాజ‌ల్‌కు మ‌ద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ‌

ప్ర‌ముఖ సినీ న‌టి.. చంద‌మామ‌గా ముద్దుగా పిలుచుకునే కాజ‌ల్ అగ‌ర్వాల్ కు మ‌ద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆమె మాట‌కు న్యాయ‌స్థానం నో చెప్పేసింది. సినిమాలే త‌ప్పించి.. కోర్టుల చుట్టూ కాజ‌ల్ ఎప్ప‌టి నుంచి తిరుగుతోంది?  ఏ ఇష్యూ మీద మ‌ద్రాస్ హైకోర్టుకు వెళ్లింద‌న్న విష‌యంలోకి వెళితే..

ఒక వాణిజ్య సంస్థ‌తో కుదుర్చుకున్న ప్ర‌క‌ట‌న విష‌యంలో త‌న‌కు మ‌రింత న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలంటూ కాజ‌ల్ కోర్టుకు వెళ్లింది. వీవీడీ కొబ్బ‌రినూనె త‌యారీ సంస్థకు చెందిన యాడ్ లో 2008లో కాజ‌ల్ న‌టించింది. ఏడాది పాటు త‌న యాడ్‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చ‌న్న రూల్ ను పెట్టిన ఈ చిన్న‌దాని మాట స‌ద‌రు కంపెనీ విన‌లేద‌ట‌. ఏడాది త‌ర్వాత కూడా ఆమె న‌టించిన యాడ్ ను ప్ర‌సారం చేశారు.

దీంతో.. కాజ‌ల్ కు కోపం వ‌చ్చేసింద‌ట‌. చెప్పిన మాటేమిటి?  చేస్తున్న‌దేమిటంటూ ఆమె స‌ద‌రు కంపెనీ మీద కోర్టుకు 2011లో వెళ్లారు. రూల్ ప్ర‌కారం త‌న‌కు చెప్పిన మాట‌కు భిన్నంగా త‌న యాడ్ ను త‌న అనుమ‌తి లేకుండా వాడుకోవ‌టం ఏమిటని ప్ర‌శ్నిస్తూ.. అలా చేసినందుకు  బ‌దులుగా త‌న‌కు రూ.2.50 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఆమె కోరారు.

ఈ కేసుకు సంబంధించిన తుది విచార‌ణ బుధ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కాజ‌ల్ వేసిన కేసును కోర్టు కొట్టి వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కాపీ రైట్స్ ప్ర‌కారం ఒక ప్ర‌క‌ట‌న రూపొందించిన సంస్థ‌కు దాన్ని ఎంత కాలం ప్ర‌సారం చేయాల‌నే హ‌క్కు ఉంటుందే త‌ప్పించి.. అందులో న‌టించిన న‌టికి ఉంద‌ని పేర్కొంది. ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న ప్ర‌మోష‌న్ హ‌క్కులు స‌ద‌రు సంస్థ‌కు 60 ఏళ్ల పాటు ఉంటాయ‌ని తీర్పు స్ప‌ష్టం చేసింది. పాపం.. కంపెనీ నుంచి డ‌బ్బులు రావ‌టం త‌ర్వాత‌.. ఇన్నేళ్లుగా లాయ‌ర్ ఖ‌ర్చులు అమ్మ‌డికి చేతికి ప‌డ్డాయ‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు