అప్పుడలా అన్న దేవిశ్రీ.. ఇప్పుడిలా

అప్పుడలా అన్న దేవిశ్రీ.. ఇప్పుడిలా

‘లెజెండ్’ పోస్ట్ రిలీజ్ సక్సెస్ మీట్లో బోయపాటి శ్రీను అతి మాటలకు దేవిశ్రీ హర్ట్ అయి వేదిక మీదే బోయపాటిని కడిగి పారేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. తన నుంచి సంగీతం రాబట్టుకోవడానికి బోయపాటి తెగ కష్టపడ్డట్లు బిల్డప్ ఇవ్వడంత మండిపోయి.. అతడి గాలి తీసేశాడు దేవి. తర్వాత బోయపాటి ఎంత కవర్ చేసుకున్నా ఫలితం లేకపోయింది.

ఆ రోజు ఆ వ్యవహారం చూస్తే దేవిశ్రీ-బోయపాటి కాంబోలో ఇంకో సినిమా రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో ‘జయ జానకి నాయక’ వస్తోంది. నాడు బోయపాటి గాలి తీసేసేలా మాట్లాడిన దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు అదే దర్శకుడిని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడటం విశేషమే.

బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ ‘జయ జానకి నాయక’ లాంటి టైటిల్ పెట్టడం.. సినిమాలో ఒక చక్కటి ప్రేమకథను చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందని దేవి చెప్పాడు. ఈ కథ చెప్పినపుడు తాను ఆశ్చర్యపోయానని.. ఈ సినిమా ఎలా తీస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశానని దేవిశ్రీ అన్నాడు. ఈ కథ చెప్పి తనకు చాలా కాలం కావడంతో.. బోయపాటిని కలిసినపుడల్లా ఆ కథతో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగేవాడినని.. చివరికి సినిమా చూశాక ఎంత బాగా తీశాడో అనిపించిందని దేవిశ్రీ చెప్పాడు. కొన్ని పాటలు తీసిన విధానం చాలా ఆశ్చర్యపరిచిందని.. ప్రతి పాటలోనూ కథ కూడా ఉందని.. ఈ సినిమా ప్రారంభ సన్నివేశమే చాలా కొత్తగా ఉందని.. ట్విస్టులు అదిరిపోతాయని.. ఈ చిత్రంతో కొత్త బోయపాటిని చూస్తారని అన్నాడు దేవి.

హంసల దీవిలో తీసిన యాక్షన్ ఘట్టం చూసి ఆశ్చర్యపోయానని.. దానికి నేపథ్య సంగీతం చాలా ప్రత్యేకంగా చేయాల్సి వచ్చిందని దేవి చెప్పాడు. మొత్తంగా బోయపాటి సినిమా గురించి దేవిశ్రీ ఈ రేంజిలో పొగిడేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఈ మాటలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు