రకుల్ ప్రీత్‌ను బాధపెట్టిన ఆ గాసిప్..

రకుల్ ప్రీత్‌ను బాధపెట్టిన ఆ గాసిప్..

సినీ పరిశ్రమలోకి వచ్చాక రూమర్లకు, గాసిప్‌లకు అలవాటు పడిపోవాలి. వాటి గురించి పట్టించుకుంటే బండి నడవడం కష్టం. అందులోనూ హీరోయిన్లయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకూడదు. ఐతే మామూలుగా అయితే తాను కూడా గాసిప్స్ విషయంలో లైట్ తీసుకుంటానని.. కానీ తన గురించి వచ్చిన ఒక గాసిప్ మాత్రం తనను చాలా బాధపెట్టిందని చెప్పింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్.

రకుల్ ప్రీత్ గత ఏడాది హైదరాబాద్‌లో రూ.3 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంది. ఐతే ఈ ఇంటిని తనకు ఒక హీరో గిఫ్ట్‌గా ఇచ్చాడని.. అతడితో తనకు ఎఫైర్ ఉందని గాసిప్స్ రావడం తనను చాలా బాధపెట్టినట్లు రకుల్ తెలిపింది. తాను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొంటే ఇలాంటి రూమర్లు పుట్టించడం ఆవేదన కలిగించిందని ఆమె చెప్పింది. నిజంగా తనకు అంత ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చే బాయ్ ఫ్రెండే ఉంటే.. తాను ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముందని రకుల్ ప్రశ్నించింది.

తాను కోట్లల్లో పుట్టి పెరగలేదని.. తన తండ్రి జీతం మీదే తమ కుటుంబం నడిచిందని.. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన తాను 24 ఏళ్లకే సొంతంగా ఇల్లు కొనడం గురించి గొప్పగా చెప్పాలి కానీ.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా గాసిప్స్ రాయడం దారుణమని.. తనకు ఎవరైనా రూ.3 కోట్లతో గిఫ్ట్ ఇచ్చేట్లయితే.. అలాంటి వ్యక్తులు తన జీవితంలో ఉన్నందుకు గర్వపడతానని.. కానీ ఆ గిఫ్ట్ స్వీకరించనని రకుల్ తెలిపింది. సెలబ్రెటీల మనోభావాల్ని కించపరిచేలా గాసిప్స్ రాయడం మానుకోవాలని రకుల్ మీడియాకు హితవు పలికింది.