దేవిశ్రీని హీరోను చేసి తీరుతాడట

దేవిశ్రీని హీరోను చేసి తీరుతాడట

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారడంపై చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది. రెండేళ్ల కిందట తాను దేవిశ్రీని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు.. తమ కాంబినేషన్లో సినిమా మొదలు కానున్నట్లు సుకుమార్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ దేవిశ్రీని హీరోగా పరిచయం చేయబోతున్నాడనగానే అందరిలోనూ ఆసక్తి కలిగింది.

కానీ సుక్కు సైలెంటుగా రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ మొదలుపెట్టేశాడు. మళ్లీ దేవిశ్రీని హీరోను చేసే విషయమై ఎక్కడా మాట్లాడలేదు. దేవిశ్రీ కూడా ఈ విషయంపై సైలెంటైపోయాడు. ఐతే స్నేహితుల దినోత్సవం సందర్భంగా దేవిశ్రీతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతడి తెరంగేట్రం గురించి సుక్కు స్పందించాడు.

తాను తన స్వార్థం కోసం.. డబ్బు కోసం దేవిశ్రీ సినిమా సంగతి వదిలేసి రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ మొదులపెట్టినట్లు సుకుమార్ చెప్పాడు. ఐతే దేవిశ్రీని హీరోను చేసే బాధ్యత మాత్రం తనదే అన్నాడు. దేవిశ్రీని హీరోగా చేయమని ప్రపోజ్ చేసింది తనే అని.. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడిందని.. కానీ తప్పకుండా దేవిశ్రీని హీరోగా పెట్టి సినిమా తీస్తానని సుక్కు తెలిపాడు.

ఐతే దేవిశ్రీని హీరోగా కొనసాగమని మాత్రం తాను చెప్పనని.. హీరోగా ఎవరైనా చేయగలరని.. కానీ మ్యూజిక్ అందరూ చేయలేరు కాబట్టి అతను సంగీతంలోనే కొనసాగాలని ఆకాంక్షించాడు సుకుమార్. సినీ రంగం విషయానికి వస్తే తన బెస్ట్ ఫ్రెండ్ దేవిశ్రీనే అని.. అతడికే తాను ‘నెంబర్ వన్’ స్థానం ఇస్తానని సుకుమార్ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు