ఈటీవీ ప్రభాకర్.. నెక్స్ట్ నువ్వే

ఈటీవీ ప్రభాకర్.. నెక్స్ట్ నువ్వే

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ది విచిత్రమైన ప్రయాణం. సీరియల్స్ చేసుకుంటూ.. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఏదో అలా అలా బండి నడిపిస్తున్న వాడు.. రామోజీ రావు తనయుడు సుమన్‌కు సన్నిహితుడిగా మారి.. ఓ దశలో ఈటీవీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఏకఛత్రాధిపత్యంతో నడిపించాడతను. రామోజీ గ్రూప్‌లో ఓ బయటి వ్యక్తి వచ్చి అలా హవా నడిపించడం అన్నది అనూహ్యమైన విషయం.

కానీ ఐతే తర్వాత రామోజీ ఆగ్రహానికి గురై ఈటీవీ నుంచి బయటికి వచ్చేయడంతో ప్రభాకర్ మళ్లీ పూర్వ స్థితికే చేరాడు. మళ్లీ అవే సీరియల్స్.. అవే ప్రోగ్రామ్స్. ఐతే అక్కడితో ఆగిపోకుండా తన ప్రత్యేకత చాటుకోవాలని కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు ప్రభాకర్.

ఓంకార్ తరహాలో వెండితెరపై దర్శకుడిగా రుజువు చేసుకోవాలని చాలా కాలంగా చేస్తున్న ప్రభాకర్ ప్రయత్నం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కొన్నేళ్ల పాటు ‘గీతా ఆర్ట్స్’ వాళ్లతో ప్రయాణం సాగించిన ప్రభాకర్.. తన డైరెక్షన్ కలను నెరవేర్చుకున్నాడు. గీతా ఆర్ట్స్-యువి క్రియేషన్స్-స్టూడియో గ్రీన్ కలయికలో.. బన్నీ వాస్ నిర్మాణ సారథ్యంలో ఏర్పాటైన ‘వీ4 క్రియేషన్స్’ బేనర్లో ప్రభాకర్ తీసిన సినిమా పూర్తయింది.

దానికి ‘నెక్స్ట్ నువ్వే’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్-వైభవి జంటగా నటించారు. ఈ సినిమా తమిళంలో హిట్టయిన ‘యామిరుక్కు భయమే’కు రీమేక్. ఇది సరదాగా సాగిపోయే హార్రర్ కామెడీ మూవీ. ఈ చిత్రం దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు