'దర్శకుడు' టీం తగ్గట్లేదుగా..

'దర్శకుడు' టీం తగ్గట్లేదుగా..

ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పబ్లిసిటీ.. ప్రమోషన్ హంగామా కనిపించిన చిన్న సినిమా ఏదైనా ఉంది అంటే.. అది 'దర్శకుడు'నే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు.. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్లు.. ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు.

కొందరు యువ దర్శకుల సాయంతో కూడా ఈ సినిమా ప్రమోషన్‌కు తమ వంతు తోడ్పాటు అందించారు. మరోవైపు ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో పబ్లిసిటీ కూడా ఓ రేంజిలో చేశారు. మొత్తానికి సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన తొలి సినిమా 'కుమారి 21 ఎఫ్'తో పోలిస్తే.. రెండో సినిమాకు చాలా పెద్ద స్థాయిలోనే ప్రచార హడావుడి కనిపించింది.

రిలీజ్‌కు ముందే కాదు.. రిలీజ్ తర్వాత కూడా సుకుమార్ అండ్ టీం ప్రమోషన్ హడావుడి తగ్గించట్లేదు. సినిమా రిలీజై రెండు షోలు పడ్డాయో లేదు.. సాయంత్రానికల్లా సక్సెస్ మీట్ పెట్టేశారు. మామూలుగా వీకెండ్ అయ్యాక.. వీక్ డేస్‌లో సినిమా వీక్ అవుతుందేమో చూసుకుని సోమ-మంగళవారాల్లో సక్సెస్ మీట్లు పెడుతుంటారు.

కానీ సుకుమార్ టీం మాత్రం ఆలస్యం చేయకుండా తొలి రోజే సక్సెస్ మీట్ పెట్టి హంగామా చేసింది. సుకుమార్ తన నిర్మాణంలో వచ్చిన సినిమా గురించి తెగ పొగిడేశాడు. తన మిత్రుడు జక్కా హరిప్రసాద్ డైరెక్షన్ సూపర్బ్ అని.. హీరోగా నటించిన తన అన్న కొడుకు అశోక్‌ మీద ప్రశంసల జల్లు కురుస్తోందని.. హీరోయిన్ ఈషాను 'లేడీ నేచురల్ స్టార్' అంటూ పొగిడేస్తున్నారని కితాబిచ్చాడు సుకుమార్. మరి ఈ ప్రచార హడావుడి సినిమాకు ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు