ప్రణీతకి ప్రమోషన్ లేనట్టేనా?

 ప్రణీతకి ప్రమోషన్ లేనట్టేనా?

`అత్తారింటికి దారేది` సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన బాపు బొమ్మగా అలరించింది...  ప్రణీత. ఆ చిత్రం విజయం సాధించడంతో ఇక ప్రణీతకి అవకాశాలు వరస కడతాయని భావించారు. సెకండ్ హీరోయిన్ స్థానం నుంచి ప్రమోషన్ కూడా పొందుతుందని అనుకున్నారు. ప్రణీత కూడా అలానే భావించింది. అందుకే సినిమా విడుదలయ్యే వరకు ఒక్క సినిమా కుడా ఒప్పుకోలేదు. తీరా సినిమా విడుదలయ్యాక చూసుకుంటే ఫలితమేదీ కనిపించలేదు.  పవన్ సరసన ప్రణీత చాలా అందంగా కనిపించిందనీ, సమంతా కంటే మంచి పాత్రను పోషించిందనీ... ఇలా అంతా పాజిటివ్ గానే చెప్పుకున్నారు.

అయితే అవకాశాలు మాత్రం రాలేదు. మధ్యలో `గబ్బర్ సింగ్ 2` సినిమాకోసం ఎంపికైంది అన్నారు కానీ... చివరకు అది కూడా ఉత్తుత్తి వార్తేనని తేలింది.  దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రణీత మరోసారి రెండో హీరోయిన్ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న `రభస` సినిమాలో ఓ కథానాయికగా ప్రణీత ఎంపికైంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది.  రెండో కథానాయిక కోసం చాలా మందిని పరిశీలించారు. చివరికి ప్రణీతని ఎంపిక చేశారు. స్టార్ కథానాయికగా మారుతుందనుకుంటే ప్రణీత మాత్రం అదే స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఎన్టీఆర్ సినిమాతోనైనా అమ్మడి కెరీర్ మారుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు