'నక్షత్రం' 30 కోట్ల సినిమా అట..

'నక్షత్రం' 30 కోట్ల సినిమా అట..

తన దర్శకత్వంలో తెరకెక్కిన 'నక్షత్రం' రూ.30 కోట్ల సినిమా అంటున్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాకు వాస్తవ బడ్జెట్ రూ.30 కోట్లని చెప్పారాయన. సందీప్ కిషన్‌ను హీరోగా పెట్టి అంత బడ్జెట్‌తో సినిమా తీయడమేంటి అని సందేహం కలుగుతోందా? ఐతే ఈ రూ.30 కోట్ల లెక్కల్లో ఓ మతలబు ఉంది. ఈ సినిమాకు నిజంగా అంత ఖర్చు పెట్టలేదట కానీ.. తన సినిమాకు పని చేసిన అందరికీ సరిగ్గా పారితోషకాలు ఇచ్చి ఉంటే.. బడ్జెట్ రూ.30 కోట్లు అయ్యేదంటున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్.

సాయిధరమ్ తేజ్.. ప్రకాష్ రాజ్.. తనీష్.. శివాజీ రాజాలతో పాటు మరికొందరు 'నక్షత్రం' కోసం ఉచితంగా పని చేసినట్లు కృష్ణవంశీ తెలిపాడు. టెక్నీషియన్లు కూడా కొందరు ఫ్రీగా చేశారన్నాడు. సాయిధరమ్ తేజ్ వారం రోజులు మాత్రమే ఈ సినిమాకు పని చేయాల్సిందని.. కానీ 28 రోజుల పాటు కాల్ షీట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందని కృష్ణవంశీ తెలిపాడు. హీరోయిన్లు రెజీనా, ప్రగ్యా జైశ్వాల్‌లకు మార్కెట్ వాల్యూతో పోలిస్తే పావు శాతం మాత్రమే పారితోషకం ఇచ్చినట్లు కృష్ణవంశీ తెలిపాడు.

ఐతే పారితోషకాల్లో ఇంత కోత పెట్టినా.. చాలామంది ఫ్రీగా పని చేసినా.. సినిమా బడ్జెట్ 30 శాతం పెరిగిందని కృష్ణవంశీ వెల్లడించాడు. కాబట్టే తన కెరీర్లో ఎన్నడూ కమర్షియల్ సక్సెస్‌ల గురించి మాట్లాడని తాను.. 'నక్షత్రం' మాత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు కృష్ణవంశీ తెలిపాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని తనకు 100 శాతం నమ్మకం ఉన్నట్లు కూడా చెప్పాడు. ఈ సినిమా సరిగా ఆడని పక్షంలో తాను సర్వైవల్ కోసం కష్టపడాల్సి ఉంటుందని కృష్ణవంశీ అనడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు