ఈ వ్యాక్సిన్లకు బుకింగ్ క్లోజ్

అవును నరేంద్రమోడి సర్కార్ చేసిన తప్పిదం కారణంగా ఫైజర్, మోడెర్నా టీకాలకు ఇప్పట్లో భారత్ కు వచ్చే అవకాశం లేదు. తమ టీకాలు భారత్ లోకి అందుబాటులోకి రావాలంటే 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అంటు పై రెండు సంస్ధల ప్రతినిధులు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కు స్పష్టగా చెప్పేశారట. ఒకపుడు పై రెండు సంస్ధలు తమ టీకాలను విడుదల చేయటానికి కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాయి.

అయితే అత్యవసర వినియోగం కింద భారత్ లో రిలీజ్ చేయటానికి అప్పట్లో కేంద్రం అంగీకరించలేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే కానీ ఫైజర్, మోడెర్నా టీకాలను భారత్ మార్కెట్లోకి విడదలకు అనుమతించేది లేదని తెగేసి చెప్పింది. విచిత్రమేమిటంటే ఇపుడు మార్కెట్లో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు కూడా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే కేంద్రం మార్కెట్లోకి రిలీజ్ చేసేసింది.

కేంద్రం ఎప్పుడైతే క్లినికల్ ట్రయల్స్ నిబంధనను గట్టిగా చెప్పిందో పై రెండు కంపెనీలు భారత్ కు గుడ్ బై చెప్పేశాయి. అయితే కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయెటెక్ అయినా కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ కంపెనీ అయినా డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. దాంతో దేశం మొత్తంమీద టీకాలకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

జనాల నుండి వస్తున్న ఒత్తిళ్ళు, ఆరోపణలను తట్టుకోలేక చివరకు కేంద్రం విదేశీ కంపెనీలను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే ఫైజర్, మోడెర్నా ప్రతినిధులతో జై శంకర్ భేటీ అయ్యారు. దేశంలో పరిస్దితులను వివరించి వెంటనే టీకాలను మార్కెట్లోకి తీసుకురమ్మన్నారు. అయితే ఆయన ఆహ్వానాన్ని సంస్ధలు తిరస్కరించాయి. తమకు ఆర్డర్లిచ్చిన దేశాలకు టీకాలను అందించాలంటేనే చాలా సమయం పడుతుందన్నారు.

అమెరికా సహా యురోపు దేశాలు ఇప్పటికే వందల మిలియన్ డోసులకు అడ్వాన్సులిచ్చిన విషయాన్ని ప్రతినిధులు ప్రస్తావించారు. వాటికి టీకాలు ఇవ్వాలంటేనే మరో రెండేళ్ళు పడుతుందన్నారు. కాబట్టి ఏ లెక్క చూసుకున్నా భారత్ లో తమ టీకాలు రిలీజ్ చేయాలంటే కనీసం 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అని తెగేసి చెప్పారట. కేంద్రప్రభుత్వం వ్యవహారం ఎలాగుందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది.