మెగా ఒత్తిడి.. బాక్సాఫీస్‌ ఉక్కిరి బిక్కిరి

మెగా ఒత్తిడి.. బాక్సాఫీస్‌ ఉక్కిరి బిక్కిరి

ఎన్నడూ లేనిది ఆగస్టులో అత్యధిక చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆగమేఘాల మీద సన్నాహాలు చేసుకుంటున్నారు. సెప్టెంబర్‌లో పెద్ద సినిమాలు వస్తున్నాయని చాలా మంది ఆగస్టులోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో ఈమధ్య కాలంలోనే ఎన్నడూ లేనన్ని రిలీజ్‌లు క్యూ కట్టాయి.

ఈ వారం నక్షత్రం, దర్శకుడు చిత్రాలతో మొదలయ్యే సందడి ఆగస్టు చివరి వారం వరకు కొనసాగనుంది. ఆగస్టు 11న లై, జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి రిలీజ్‌ అవుతున్నాయి. ఆగస్టు 18న ఉంగరాల రాంబాబు, ఆనందో బ్రహ్మ రిలీజ్‌ అవుతాయని సమాచారం. ఆ తదుపరి వారంలో 'యుద్ధం శరణం'తో పాటు అర్జున్‌ రెడ్డిని కూడా లైన్‌లో పెట్టారు.

ఇవి కాకుండా అనువాద చిత్రాలు విఐపి 2, వివేకం కూడా ఇదే నెలలో విడుదలవుతున్నాయి. ఒక నెలలో ఇన్ని చెప్పుకోతగ్గ చిత్రాలు రిలీజ్‌ అవడం ఈమధ్య  కాలంలో జరగలేదు. ఇవి కాకుండా ఇంకా చాలా చిన్న చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి.

ప్రతి సినిమాకీ వారానికి మించి టైమ్‌ లేకపోవడంతో చాలా బాగుంటే తప్ప నిలబడే అవకాశాలు తక్కువే. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ వుంటుందని ట్రేడ్‌ సర్కిల్స్‌ హెచ్చరిస్తున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం భారీ చిత్రాలకి పోటీగా వెళ్లి ఇబ్బంది పడడం కంటే సమవుజ్జీలతోనే అమీ తుమీ తేల్చుకోవడం బెటర్‌ అనుకుంటున్నారు.