ఎవరూ తగ్గట్లేదు... నితిన్‌ కూడా సై

ఎవరూ తగ్గట్లేదు... నితిన్‌ కూడా సై

పోటీ తీవ్రంగా వుండడంతో 'లై' వెనక్కి తగ్గుతుందని వినిపించిన టాక్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తూ 'లై' నిర్మాతలు కూడా సై అనేసారు. ఆగస్టు 11న 'లై'ని విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించిన 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అదే డేట్‌ని మరోసారి కన్‌ఫర్మ్‌ చేస్తూ తమ సినిమా వస్తోందని మళ్లీ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మరోవైపు 'జయ జానకి నాయక', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలకి కూడా డేట్‌తో పాటు పోస్టర్లు విడుదల చేసారు.

దీంతో మూడు సినిమాలు కనీసం ఒక్క రోజు గ్యాప్‌ లేకుండా ఒకేసారి విడుదల అవుతున్నాయి. మూడూ పెద్ద చిత్రాలే కావడంతో బయ్యర్లకి తగని చిక్కొచ్చి పడింది. ఆ వారంలో సోమ, మంగళవారాలు పబ్లిక్‌ హాలిడేస్‌ కావడంతోనే ఇంతమంది ఎగబడుతున్నారు.

అయితే పోటీ ఇంత తీవ్రంగా వున్నపుడు రెండు సెలవుల వల్ల అన్ని సినిమాలు బెనిఫిట్‌ అవడమనేది వుండదు. కానీ వెనక్కి తగ్గడానికి ఎవరూ ఇష్టపడకపోవడంతో ఈ క్లాష్‌ తప్పడం లేదు. దీని వల్ల టాక్‌ వచ్చిన సినిమాకి కూడా సరిపడా థియేటర్లు వుండవు. అదీ గాక ఆగస్టులో ప్రతి వారం సినిమాలు చాలానే రిలీజ్‌ అవుతున్నాయి కనుక తర్వాత పెంచుకునే వీలు కూడా వుండదు.

ఈ పోటీ వల్ల తప్పకుండా నష్టం వుంటుందని ట్రేడ్‌ అంటోంది. ఈ శుక్రవారం వీటిలో ఒకటి వచ్చేసినట్టయితే బాగుండేదని, బాక్సాఫీస్‌ వద్ద కాస్త స్పేస్‌ దక్కేదని అంటున్నారు. ఇక ఇప్పుడు వెనక్కి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడడం లేదు కనుక ఈ క్లాష్‌లో ఎవరిది పైచేయి అవుతుందనేది చూద్దాం.