అమ్మానాన్న విడిపోవ‌డం మంచికే-శ్రుతి

త‌ల్లిదండ్రుల మ‌ధ్య విభేదాలొచ్చి విడిపోతుంటే పిల్ల‌ల బాధ అంతా ఇంతా కాదు. అందులోనూ వాళ్ల‌కు ఊహ తెలిశాక త‌ల్లిదండ్రులు విడిపోతుంటే త‌ట్టుకోలేరు. వాళ్లు క‌లిసి ఉండాల‌నే కోరుకుంటారు. కానీ త‌మ త‌ల్లిదండ్రులు క‌మ‌ల్ హాస‌న్, సారిక విడిపోవ‌డం అప్ప‌ట్లో బాధ క‌లిగించిన‌ప్ప‌టికీ.. విడాకులు తీసుకోవాల‌న్న వాళ్ల నిర్ణ‌యం మంచిదే అని శ్రుతి హాస‌న్ అభిప్రాయ‌ప‌డింది. 1988లో క‌మ‌ల్, సారిక పెళ్లి చేసుకోగా.. 16 ఏళ్ల వైవాహిక జీవితం అనంత‌రం 2004లో వీళ్లిద్ద‌రూ విడిపోయారు. ఇక అప్ప‌ట్నుంచి శ్రుతి, అక్ష‌ర ఎక్కువ‌గా చెన్నైలో తండ్రి ద‌గ్గ‌రే పెరిగారు. క‌థానాయిక‌గా ఒక స్థాయి అందుకున్నాక శ్రుతి వేరుగా ఉంటోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో శ్రుతి త‌న త‌ల్లిదండ్రుల విడాకుల గురించి మాట్లాడింది.

మా అమ్మా నాన్న‌లు విడిపోవ‌డం గురించి మాట్లాడాల్సి వ‌స్తే నేను ఉద్వేగానికి గుర‌వుతా. ఒక‌రితో ఒక‌రికి పొస‌గ‌న‌పుడు వేరుగా ఉండ‌ట‌మే స‌రైంద‌ని నేను భావిస్తా. వాళ్లిద్ద‌రూ మా త‌ల్లిదండ్రులుగా గొప్ప‌గా త‌మ బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించారు. నేను ఎక్కువ‌గా నాన్న‌తో గ‌డిపాను. అమ్మ తన బాధ్య‌త‌గా ఏం చేయాలో అది చేసింది. విడాకులు తీసుకోవ‌డం వ‌ల్ల ఇద్ద‌రికీ మంచే జ‌రిగింది. వ్య‌క్తిగ‌తంగా వాళ్లిద్ద‌రూ ఉత్తమ‌మైన వాళ్లే. కానీ ఇద్ద‌రు ఉత్త‌ములు క‌లిసి ఆనందంగా జీవించ‌గ‌ల‌ర‌నేమీ లేదు. నిజానికి వాళ్లు క‌లిసి ఉన్న‌ప్ప‌టి కంటే విడిపోయాక ఎక్కువ సంతోషంగా ఉన్నారు. మా అమ్మ‌, నాన్న విడిపోయిన స‌మ‌యానికి నాది చిన్న వ‌య‌సు. అప్పుడు బాధ ప‌డ్డా స‌రే.. త‌ర్వాత వాళ్ల నిర్ణ‌యం స‌రైంద‌ని అర్థం చేసుకున్నా అని శ్రుతి చెప్పింది. ఇటీవ‌లే క్రాక్ సినిమాతో తెలుగులో మంచి విజ‌యాన్నందుకున్న శ్రుతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ లాంటి భారీ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.