వెంకీ పక్కన రానా సూటవుతాడా?

వెంకీ పక్కన రానా సూటవుతాడా?

విక్టరీ వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు తీస్తే.. అందులో మెజారిటీ రీమేక్ సినిమాలే ఉంటాయి. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నపుడల్లా వెంకీకి రీమేక్‌లే గుర్తుకొస్తాయి. మూడేళ్ల కిందట వెంకీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నపుడు చేసిన ‘దృశ్యం’ రీమేకే. అలాగే పోయినేడాది ‘బాబు బంగారం’ బోల్తా కొట్టాక ఆయన్ని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ‘గురు’ కూడా రీమేకే. దీని తర్వాత డైరెక్ట్ మూవీనే చేద్దామని వెంకీ చూశాడు కానీ.. సెట్టవ్వలేదు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో అనుకున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ ఆగిపోయింది. పూరితో అనుకున్న సినిమా కూడా సెట్టవ్వలేదు. దీంతో తర్వాతి సినిమా ఏదీ సెట్టవ్వక ఐదారు నెలలుగా ఖాళీగా ఉన్నాడు వెంకీ.

ఐతే ఇప్పుడు వెంకీ కళ్లు మళ్లీ ఓ రీమేక్ మీద పడ్డట్లు వార్తలొస్తున్నాయి. పది రోజుల కిందట తమిళంలో విడుదలై సెన్సేషనల్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘విక్రమ్ వేద’ మీద వెంకీ దృష్టిసారించినట్లు సమాచారం. ‘గురు’ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ నిర్మించిన శశికాంతే ‘విక్రమ్ వేద’కు నిర్మాత. ‘గురు’ ఒరిజినల్లో నటించిన మాధవన్.. ‘విక్రమ్ వేద’లో కీలక పాత్రధారి. ఇందులో విజయ్ సేతుపతి మరో హీరోగా నటించాడు. టాలీవుడ్లో మల్టీస్టారర్లు మళ్లీ ఊపందుకోవడానికి ప్రధాన కారకుడైన వెంకీ.. మరోసారి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయిపోయినట్లు సమాచారం.

విజయ్ సేతుపతి పోషించిన రఫ్ క్రిమినల్ పాత్రను వెంకీ చేయాలనుకుంటున్నాడట. మాధవన్ చేసిన పోలీసాఫీసర్ పాత్రను తన అన్న కొడుకు రానాతో చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాడట. ఐతే అది కరెక్ట్ ఛాయిస్ కాకపోవచ్చని.. నువ్వా నేనా అన్నట్లుండే ఈ పాత్రల్ని బాబాయ్-అబ్బాయ్ చేస్తే ఇంటెన్సిటీ ఉండదని అభిప్రాయపడుతున్నారు ఈ సినిమా చూసిన వాళ్లు. మరి వెంకీ ఏం డిసైడ్ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు