తేజతో సినిమా ఎందుకన్నారట..

తేజతో సినిమా ఎందుకన్నారట..

ఓవైపు దగ్గుబాటి రానా చూస్తే.. ‘బాహుబలి’, ‘ఘాజీ’ లాంటి సినిమాలతో మాంచి ఊపు మీద ఉన్నాడు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ ఇండస్ట్రీల నుంచి కూడా దర్శక నిర్మాతలు వెంటపడుతున్న పరిస్థితి. మరోవైపు డైరెక్టర్ తేజ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. పుష్కర కాలంగా హిట్టు ముఖం చూడని తేజను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది.
నిర్మాతలకూ అతడిపై నమ్మకం కోల్పోయింది. ఇలాంటి స్థితిలో రానా.. తేజ దర్శకత్వంలో సినిమా చేస్తాడని, ఆ చిత్రాన్ని స్వయంగా రానా తండ్రి సురేషే నిర్మిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ఊహించనిదే జరిగింది. రానా-తేజ కాంబినేషన్లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తెరకెక్కింది. ఐతే తేజతో ఎందుకంటూ ఈ సినిమా మొదలైనపుడు చాలామంది నుంచి ప్రశ్నలు ఎదురైనట్లు రానా తెలిపాడు.

‘‘తేజతో సినిమా ఎందుకని చాలామంది అడిగారు. కానీ నేను దర్శకుల పేర్లు చూసి.. వాళ్ల ట్రాక్ రికార్డు చూసి సినిమాలు చేయను. నన్ను ఎగ్జైట్ చేసేది కథే. ‘బాహుబలి’ అంత పెద్ద విజయం సాధించిందంటే అది రాజమౌళి గొప్పదనం కాదు. ‘బాహబులి’ గొప్పదనం. ఆ కథను చూసే ఆ సినిమా చేశా. అలాగే కొత్త దర్శకుడైన సంకల్ప్ రెడ్డిని నమ్మి ‘ఘాజీ’ చేశానంటే అది ఆ స్క్రిప్టులో ఉన్న గొప్పదనం. అలాగే తేజ గారితో సినిమా చేయడానికి ఆయన చెప్పిన కథే కారణం. నేను కలిసిన బెస్ట్ రైటర్లలో ఆయనొకడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా గురించి ఆయన అద్భుతమైన బ్రీఫింగ్ ఇచ్చారు. పది నెలల పాటు ఈ స్క్రిప్టును అద్భుతంగా తీర్చిదిద్దాం. సినిమా కూడా అంతే బాగా వచ్చింది’’ అని రానా తెలిపాడు.

తాను రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసే ప్రసక్తే లేదని.. అలాంటి సినిమాలు చేయడానికి చాలామంది హీరోలున్నారని.. తన ప్రత్యేకతను చాటి చెప్పే సినిమాలే చేస్తానని రానా స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English