‘బిగ్ బాస్’లో అందరూ ఆమెపై కక్ష కట్టేశారు

‘బిగ్ బాస్’లో అందరూ ఆమెపై కక్ష కట్టేశారు

కేవలం పార్టిసిపెంట్లు మాత్రమే కనిపించే వీక్ డేస్‌లో వీక్ అవుతూ.. ఎన్టీఆర్ కనిపించే వీకెండ్స్‌లో మంచి ఆదరణ సంపాదించుకుంటూ తెలుగు ‘బిగ్ బాస్’ షో అలా అలా బాగానే నడిచిపోతోంది. ఆరంభోత్సవం తర్వాత వీకెండ్లో అదరగొట్టేసి వెళ్లిన ఎన్టీఆర్.. ఈ వీకెండ్లో రీఎంట్రీ ఇచ్చాడు.

ఈసారి కూడా తన చలాకీ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. ఈ ఎపిసోడ్లో కొన్ని ఆసక్తికర మలుపులు కూడా ఉండటంతో జనాల్లో బాగానే క్యూరియాసిటీ పెంచింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మధుప్రియ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించడమే కాక.. హౌస్ లోపలికి ఓ కొత్త వ్యక్తి వస్తున్నట్లు ప్రకటించి జనాల్లో ఆసక్తి రేకెత్తించాడు ఎన్టీఆర్.

ఇక షోలోని మిగతా విశేషాల విషయానికొస్తే.. శనివారం మహేష్ కత్తితో చికెన్ చేయించి.. దాన్ని స్వయంగా రుచి చూసి.. దానికి ‘కత్తి చికెన్’ అని పేరు పెట్టాడు ఎన్టీఆర్. మరోవైపు బిగ్ బాస్ హౌస్‌లోకి ఓ విచిత్రమైన సింహాసనం తెచ్చి వేయించి.. దానికి ప్రతినాయకుడి సింహాసనం అని పేరు పెట్టారు. హౌస్‌లో ఉన్న వాళ్లు ఒక్కొక్కరుగా మిగతా వాళ్లలో ఎవర్ని విలన్ అనుకుంటున్నారో చెప్పి.. వాళ్లను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. వాళ్లు ఎందుకు విలనో చెప్పాలి. ఎన్టీఆర్ ఇలా చెప్పాక ఒక్కొక్కరుగా తమ విలన్ని తీసుకొచ్చి సింహాసనంపై కూర్చో బెట్టి ఆ వ్యక్తిపై తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు.

విశేషం ఏంటంటే.. మిగతా 12 మందిలో ఏడుగురు సింగర్ కల్పననే విలన్ ఛైర్లో కూర్చోబెట్టేశారు.. ఆమె గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడారు. ఆమె డబుల్ గేమ్స్ ఆడుతోందని ఒకరు.. ఆమె బిగ్ బాస్‌కు పనికి రాదని ఇంకొకరు.. కెమెరాల ముందు ఎక్కువగా నటించేస్తోందని మరొకరు.. ఇలా ఆమెపై చాలా కంప్లైంట్లే చెప్పారు. ఇది చాలదన్నట్లుగా ఎన్టీఆర్.. కల్పనను ఉద్దేశించి ‘‘నన్ను అన్నా అని మాత్రం అనకు. ఇంకే పిలుపుతోనైనా పిలు’’ అన్నాడు. దానికామె బదులిస్తూ.. ‘‘తారక్ గారూ అంటాను’’ అని చెప్పింది. మొత్తానికి ‘బిగ్ బాస్’ హౌస్‌లో కల్పన మీద మిగతా పార్టిసిపెంట్లు బాగానే కక్ష కట్టేశారని అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు