ఆక్సిజన్ ఎప్పుడందాలి.. బుల్లెట్ ఎప్పుడు దిగాలి

ఆక్సిజన్ ఎప్పుడందాలి.. బుల్లెట్ ఎప్పుడు దిగాలి

హీరో గోపీచంద్ పరిస్థితి చూసి అతడి అభిమానులే కాదు.. ఇండస్ట్రీ జనాలు, సామాన్య ప్రేక్షకులు సైతం అయ్యో అనుకునే పరిస్థితి. అసలే హిట్లు కరవైపోయి అల్లాడుతుంటే.. దీనికి తోడు 'ఆక్సిజన్', 'ఆరడుగుల బుల్లెట్' సినిమాలు విడుదలకే నోచుకోకుండా ఆగిపోయాయి. ఇలాంటి స్థితిలో గోపీ ఆశలన్నీ 'గౌతమ్ నంద' మీదే నిలిచాయి.

మిగతా సినిమాల ప్రభావం దీని మీద ఏమీ పడకుండా.. ఇది మంచి క్రేజే తెచ్చుకుంది. బిజినెస్ కూడా బాగానే అయింది. ప్రోమోలవీ చూస్తే జనాలకు ఈ సినిమా మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలిగింది. అందుకే ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్ సంగతలా వదిలేసి.. ముందు 'గౌతమ్ నంద'ను రిలీజ్ చేయించే పనిలో పడ్డాడు గోపీ.

ఈ సినిమా హిట్టయితే ఆటోమేటిగ్గా ఆ రెండు సినిమాల విడుదలకు మార్గం సుగమమవుతుందని.. ఈ సినిమా తాలూకు క్రేజ్ వాటికి కలిసొస్తుందని ఆశించాడు గోపీచంద్. కానీ 'గౌతమ్ నంద'నే దెబ్బ కొట్టేస్తుందని అతను ఊహించలేదు. ఆ రెండు సినిమాల్ని బయటికి తేవడం ఏమో కానీ.. ఇప్పుడు ఈ సినిమాను నమ్ముకున్న బయ్యర్లు బయటపడటం కష్టంగా ఉంది.

గోపీ సినిమాలు మామూలుగా తెరకెక్కే బడ్జెట్లో తెరకెక్కి.. అతడి సినిమాలకు మామూలుగా అయ్యే బిజినెస్సే దీనికీ అయి ఉంటే మరీ ఇబ్బందేమీ వచ్చేది కాదు. కానీ దీని బడ్జెట్ ఎక్కువ. బిజినెస్ కూడా దానికి తగ్గట్లే జరిగింది. కానీ ఓపెనింగ్స్ చూస్తే నిరాశాజనకంగా ఉన్నాయి. పెట్టుబడిలో సగానికి మించి వసూలయ్యేలా కనిపించడం లేదు. ఇక 'ఆక్సిజన్', 'ఆరడుగుల బుల్లెట్' సినిమాల పరిస్థితి ఏమవుతుందో అంచనా వేయడమూ కష్టంగానే కనిపిస్తోంది. 'గౌతమ్ నంద' ఫలితం గోపీచంద్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టేసేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు