మళ్లీ శర్మ హవా ?

మళ్లీ శర్మ హవా ?

తెలుగు సినిమాల్లో ఏ సంగీత దర్శకుడైనా సరే.. పదేళ్లో పదిహేనేళ్లో హవా సాగిస్తుంటాడు. నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతాడు. ఆ తర్వాత ఇంకో సంగీత తరంగం దూసుకొస్తుంది. ఆపై ఆ మ్యూజిక్ డైరెక్టరే ఆధిపత్యం చలాయిస్తాడు. అప్పటిదాకా జోరు చూపించిన మ్యూజిక్ డైరెక్టర్ సైడైపోతాడు. 2000 సంవత్సరానికి ముందు.. తర్వాత కలిపి ఓ పది పన్నెండేళ్ల పాటు మణిశర్మ ఆధిపత్యం చలాయించాడు.

ఐతే దేవిశ్రీ ప్రసాద్, చక్రి, ఆర్పీ పట్నాయక్ లాంటి యువ సంగీత దర్శకుల రాకతో మణిశర్మ హవా తగ్గింది. క్రమంగా ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. చక్రి, ఆర్పీ జోరు తగ్గించేసినప్పటికీ దేవిశ్రీ సుదీర్ఘ కాలంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మధ్యలో తమన్, అనూప్ లాంటి వాళ్లూ మంచి అవకాశాలందుకుంటున్నారు. దీంతో మణిశర్మ కథ ముగిసిపోయినట్లే కనిపించింది. ఓ దశలో ఆయన్ని అందరూ మరిచిపోయారు. అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు నేపథ్య సంగీతం మాత్రమే చేసుకుంటూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు మణి.

కానీ రెండు మూడేళ్ల నుంచి మణిశర్మ మళ్లీ నెమ్మదిగా రైజ్ అవుతూ వస్తున్నాడు. గత ఏడాది ‘జెంటిల్‌మన్’ సినిమాతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు మణి. ఆ సినిమాలో మణిశర్మ నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి వరుసగా సంగీత ప్రాధాన్యమున్న సినిమాలకు పని చేస్తూ తన స్పెషాలిటీ చూపిస్తున్నాడు మణి. ‘జెంటిల్‌మన్’ తర్వాత ‘ఫ్యాషన్ డిజైనర్’, ‘అమీతుమీ’, ‘శమంతకమణి’ సినిమాలు మణిశర్మకు మంచి పేరు తెచ్చాయి.
ప్రస్తుతం ‘లై’ లాంటి క్రేజీ మూవీకి సంగీతం అందిస్తున్నాడాయన. దీంతో పాటు కళ్యాణ్ రామ్ ‘ఎంఎల్ఏ’, నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’.. ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరి తీయబోయే సినిమా.. రైటర్ శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం కానున్న ‘బృందావనమది అందరిది’ సినిమాలకు కూడా మణిశర్మే సంగీత దర్శకుడు. ఇంతకుముందులా భారీ సినిమాలకు పని చేయకపోయినా.. చిన్న, ఓ మోస్తరు స్థాయిలోనే సంగీత ప్రాధాన్యమున్న సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ మళ్లీ మణిశర్మ హవా నడిపిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English