ఇక తర్వాతి పరీక్ష ఆయనకు..

ఇక తర్వాతి పరీక్ష ఆయనకు..

టాలీవుడ్లో దర్శకులకు వరుసగా పరీక్షలు ఎదురవుతున్నాయి. తమ కెరీర్ కు కీలకమైన సినిమాలతో ఒక్కొక్కరుగా దర్శకులు ప్రేక్షకుల తీర్పు కోరుతూ వస్తున్నారు. ఒకప్పుడు క్లాసిక్స్ తీసి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయిన శేఖర్ కమ్ముల వారం కిందట ‘ఫిదా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతడికి మంచి ఫలితమే దక్కింది. ‘ఫిదా’ కమ్ముల కెరీర్‌కు మళ్లీ ఊపిరులూదింది. కమ్ముల పేరు మళ్లీ టాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఇక ఈ శుక్రవారం సంపత్ నంది ‘గౌతమ్ నంద’ రూపంలో పరీక్ష ఎదుర్కొన్నాడు. ఇంతకుముందు తీసిన మూడు సినిమాలతో మెప్పించినప్పటికీ.. సంపత్ నంది మళ్లీ ‘గౌతమ్ నంద’తో తనేంటో రుజువు చేసుకోవాల్సి వచ్చింది. కానీ అతడికి ఆశించిన ఫలితాన్నిచ్చేలా కనిపించడం లేదీ సినిమా.

ఇక తర్వాతి వారం ఓ పెద్ద దర్శకుడు ప్రేక్షకుల తీర్పు కోరుతున్నాడు. ఆయనే.. కృష్ణవంశీ. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన కృష్ణవంశీ.. గత దశాబ్ద కాలంలో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తీయలేదు. కెరీర్ స్లంప్‌లో ఉండగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం లభించినా ఆయన సద్వినియోగం చేసుకోలేదు. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ నిరాశపరిచింది. ఇప్పుడు కృష్ణవంశీ ఆశలన్నీ ‘నక్షత్రం’ సినిమా మీదే ఉన్నాయి.

అనేక అవాంతరాల్ని దాటుకుని ఈ సినిమా వచ్చే శుక్రవారమే విడుదల కాబోతోంది. కృష్ణవంశీ బాలయ్యతో ‘రైతు’ చేయాలన్నా.. అది కాక ఇంకో ప్రాజెక్టు ఏదైనా లైన్లో పెట్టాలన్నా ఈ సినిమా బాగా ఆడటం కీలకం. ఇంకో సినిమా చేయడం సంగతలా ఉంచితే.. తన పనైపోయిందన్న వాళ్లకు సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉన్నాడు కృష్ణవంశీ. మరి ఆయనకు ‘నక్షత్రం’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు