శంకర్ ముందు చేతులు జోడిస్తా-విజయేంద్ర

శంకర్ ముందు చేతులు జోడిస్తా-విజయేంద్ర

ఒకప్పుడు సౌత్ ఇండియాలో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు శంకర్. ఐతే ఈ మధ్య కాలంలో ఎస్.ఎస్.రాజమౌళి అతణ్ని ఓవర్ టేక్ చేసేశాడు. ‘బాహుబలి’తో తిరుగులేని విజయాన్నందుకున్న రాజమౌళి.. శంకర్ ను పక్కకు నెట్టేసి సౌత్ సినిమాకు ముఖచిత్రంగా మారిపోయాడు.  ఈ నేపథ్యంలో చాలామంది శంకర్ ను తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెట్టేశారు కూడా. ఐతే ఇప్పుడు స్వయంగా రాజమౌళి తండ్రి, ‘బాహుబలి’ కథకుడు అయిన విజయేంద్ర ప్రసాద్.. శంకర్ మీద తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘‘శంకర్ మీ వద్దకొచ్చి కథ రాయమని అడిగితే రాస్తారా’’ అని విజయేంద్ర ప్రసాద్ ను అడిగితే.. ‘‘అదేం ప్రశ్న? ఆయన నన్ను అడగడం కాదు. నేను కథ రాసి దాంతో సినిమా చేయమని చేతులు జోడించి అడుగుతా’’ అని బదులిచ్చాడు విజయేంద్ర ప్రసాద్. దీన్ని బట్టే విజయేంద్ర ప్రసాద్ దృష్టిలో శంకర్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే శంకర్ సినిమా ఒకదానికి విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ రాస్తున్నాడు కొన్నాళ్లుగా.

శంకర్ సినిమాల్లో ‘ది బెస్ట్’ అనదగ్గ వాటిలో ఒకటైన ‘ముదల్ వన్’ (ఒకే ఒక్కడు)కు కొనసాగింపుగా ఓ స్క్రిప్టు తయారు చేస్తున్నాడు. ఈ సంగతి ఇదే ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ధ్రువీకరించాడు. దీన్ని అచ్చంగా సీక్వెల్ అనలేమని.. కానీ ఆ లైన్స్ లోనే ఉంటుందని.. దీంతో పాటు తన కొడుకు తీసిన ‘విక్రమార్కుడు’కు కూడా సీక్వెల్ రాస్తున్నానని చెప్పారాయన. ఐతే ఈ రెండూ హిందీ కోసం రాస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలపడం విశేషం. విక్రమార్కుడు ‘రౌడీ రాథోడ్’ పేరుతో.. ముదల్ వన్ ‘నాయక్’ పేరుతో హిందీలో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు