ఆ యాక్ష‌న్ హీరోకీ లైంగిక వేధింపులు!

ఆ యాక్ష‌న్ హీరోకీ లైంగిక వేధింపులు!

ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హిళ‌లు.. సెల‌బ్రిటీలు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపులు ఎదురైన‌ట్లు చెప్ప‌టం.. అవి సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే. అయితే.. ఒక బాలీవుడ్ ప్ర‌ముఖ హీరో సైతం లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విష‌యం ఇప్పుడు విస్మ‌య‌క‌రంగా మారింద‌ని చెప్పాలి. త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల గురించి స‌ద‌రు హీరోనే వెల్ల‌డించారు. ఇంత‌కీ ఆ బాలీవుడ్ హీరో ఎవ‌రంటే.. యాక్ష‌న్ స్టార్ గా పేరున్న అక్ష‌య్ కుమార్‌.

ముంబ‌యిలో జ‌రిగిన మాన‌వ అక్ర‌మ ర‌వాణా అంశంపై నిర్వ‌హించిన ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ లో అక్ష‌య్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్ల‌డించారు. "నా చిన్న‌ప్పుడు జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌ను మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను.చిన్న‌ప్పుడు మేం ఉంటున్న అపార్టెమెంట్ లోని లిఫ్ట్ లో వెళుతున్న‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న లిఫ్ట్ బాయ్ న‌న్ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తాకాడు. వెంట‌నే.. ఆ విష‌యాన్ని అమ్మానాన్న‌ల‌కు చెప్పా. అత‌డ్ని హెచ్చ‌రించి వ‌దిలేశారు" అని  చెప్పారు.

ఆ త‌ర్వాత కూడా అత‌ను ఇలాంటి ప‌నులే చేయ‌టంతో అత‌డ్ని పోలీసులు అరెస్ట్ చేశార‌న్నారు. ఇలాంటి విష‌యాల ప‌ట్ల  త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న అక్ష‌య్‌.. పిల్ల‌లు ఇలాంటివి త‌మ‌కు ఎదురైన వెంట‌నే ఎలాంటి మొహ‌మాటం ప‌డ‌కుండా త‌ల్లిదండ్రుల‌కు చెప్పాల‌న్నారు.

అలా చేస్తేనే.. పాడు ప‌నులు చేసే వారికి స‌రిగా బుద్ధి చెప్ప‌గ‌ల‌మ‌న్నారు. ఏమైనా.. ఒక ప్ర‌ముఖ హీరో త‌న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌న్నది ప‌ట్టించుకోకుండా జ‌రిగిన విష‌యాన్ని జ‌రిగిన‌ట్లుగా చెప్ప‌టం విశేషంగా చెప్పాల్సిందే. ఈ విష‌యంలో ఆయ‌న్ను అభినందించాలి కూడా.

ఇలాంటి ఉదంతాలు ప్ర‌ముఖుల జీవితాల్లో ఉంటే.. వాటిని బ‌య‌ట‌కు చెప్ప‌టం ద్వారా.. త‌ల్లిదండ్రుల‌కు.. పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన‌ట్లు అవుతుంది. ఇలాంటి పాడు ఉదంతాలు త‌మ జీవితాల్లోకి ఎదురైన‌ప్పుడు ఎలా రియాక్ట్ కావాల‌న్న విష‌యంపై సామాన్యుల్లో చైత‌న్యం పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌ముఖులు అందుకు స‌హ‌క‌రించ‌టం ఎంతైనా అవ‌స‌రం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు