ఈ పిల్ల క్రేజును వాడేసుకుందామనే..

ఈ పిల్ల క్రేజును వాడేసుకుందామనే..

'బాహుబలి'తో ప్రభాస్ తెలుగు రాష్ట్రాల అవతల కూడా మంచి క్రేజ్ సంపాదించాడు. ఇక అంతే.. అతను అంతకుముందు నటించిన ఫ్లాప్ సినిమాల్ని కూడా వరుస బెట్టి డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు వేరే భాషల్లో. ఇలాంటి అలవాటే టాలీవుడ్ జనాలకు కూడా ఉంది. ఎవరైనా పరభాషా హీరో హీరోయిన్ల సినిమా ఏదైనా తెలుగులో ఆడిందంటే చాలు.. ఇక వరుసబెట్టి వాళ్ల సినిమాల్ని ఇక్కడికి పట్టుకొచ్చేస్తారు.

ఇప్పుడు సాయి పల్లవి విషయంలోనూ అదే జరగబోతోంది. 'ఫిదా' సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సాయిపల్లవి.. తొలి సినిమాతోనే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. వారం రోజులుగా తెలుగు సినిమా ప్రియుల చర్చలన్నీ తన చుట్టూనే తిరుగుతున్నాయి. తన పెర్ఫామెన్స్ గురించే అంతా చర్చించుకుంటున్నారు.

ఈ క్రేజ్ చూసే ఓ డిస్ట్రిబ్యూటర్ సాయిపల్లవి మలయాళంలో 'ప్రేమమ్' తర్వాత నటించిన 'కాళి' అనే సినిమా హక్కుల్ని కొనేశాడు. ఇందులో 'ఓకే బంగారం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించడం విశేషం. 'ప్రేమమ్' స్థాయిలో కాకపోయినా 'కాళి' కూడా మలయాళంలో సూపర్ హిట్టయింది. ఇప్పుడు తెలుగులో సాయిపల్లవికి మంచి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో దీన్ని డబ్ చేసి రిలీజ్ చేసేద్దామన్న ఫ్లాన్లో ఉన్నారు.

మరి సాయిపల్లవిని చూసి ఆ సినిమాకు జనాలు ఏమాత్రం ఎగబడతారో చూడాలి. మరోవైపు 'ఫిదా' విడుదలయ్యాక సాయిపల్లవికి తెలుగు నిర్మాతల నుంచి చాలానే ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట. ఐతే సాయిపల్లవి వెంటనే ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వకుండా తెలివిగా ముందే లాక్ చేసేశాడు దిల్ రాజు. ఆయన బేనర్లోనే ఆమె ఇంకో రెండు సినిమాలు చేయబోతుండటం విశేషం. అందులో ఒకటి 'ఎంసీఏ'. ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తోంది సాయిపల్లవి. దీంతో పాటు శర్వానంద్-నాగశౌర్య కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించే సినిమాలోనూ ఆమెను కథానాయిగా ఎంచుకున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు