'బాహుబలి-2' తర్వాత వాళ్లకు ఇదేనంట..

'బాహుబలి-2' తర్వాత వాళ్లకు ఇదేనంట..

'బాహుబలి: ది కంక్లూజన్' టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల వరకే దాదాపు రూ.200 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రభావం దాదాపు నెల రోజులు కొనసాగింది. అయినప్పటికీ వేరే సినిమాలు వచ్చాయి. వాటి స్థాయిలో అవి మంచి వసూళ్లే రాబట్టుకున్నాయి. నాగచైతన్య సినిమా 'రారండోయ్ చూద్దాం'.. 'బాహుబలి-2' తర్వాత సూపర్ హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ మూవీ 'దువ్వాడ జగన్నాథం' లాభాలు తేకపోయినా మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ఈ నెలలో విడుదలైన 'నిన్ను కోరి'.. 'ఫిదా' సూపర్ హిట్లుగా నిలిచాయి. 'బాహుబలి-2' తెలుగు సినిమానే అయినప్పటికీ.. దాని తర్వాత కూడా టాలీవుడ్లో సూపర్ హిట్లు వచ్చాయి.

కానీ తమిళనాట మాత్రం 'బాహుబలి-2' తర్వాత మొన్నటిదాకా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడం విశేషం. గత మూడు నెలల్లో వచ్చిన సినిమాలేవీ కూడా నిలబడలేకపోయాయి. ఒకటీ అరా సినిమాలు ఓ మోస్తరుగా వసూళ్లయితే రాబట్టాయి కానీ.. 'సూపర్ హిట్' అనిపించుకున్న సినిమానే లేదు. తమిళనాట 'బాహుబలి-2' దెబ్బకు నెలా నెలన్నర పాటు ఇంకే సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది. ఆ తర్వాత జీఎస్టీ ప్రభావం పడింది. దీనికి వ్యతిరేకంగా స్ట్రైక్స్.. ధరల పెంపు.. ఇవన్నీ సినిమాలపై ఎఫెక్ట్ చూపించాయి. ఐతే ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ అధిగమించి ఓ సినిమా సూపర్ హిట్ రేంజికి చేరుకుంది. అదే.. విక్రమ్ వేద.

విజయ్ సేతుపతి-మాధవన్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 'విక్రమ్ వేద' సూపర్ హిట్ స్థాయిని అందుకుంది. అదిరిపోయే ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ సినిమా వీకెండ్ తర్వాత కూడా చక్కటి వసూళ్లు రాబడుతోంది. విమర్శకులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భార్యాభర్తలైన పుష్కర్-గాయత్రి అనే దర్శక ద్వయం ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. విజయ్ సేతుపతి, మాధవన్‌‌ల పెర్ఫామెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయింది. సినిమా కూడా గ్రిప్పింగ్‌గా.. థ్రిల్లింగ్‌గా ఉండటంతో తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'బాహుబలి-2' తర్వాత తమిళంలో ఇదే తొలి సూపర్ హిట్ అంటూ ట్రేడ్ పండితులు తీర్మానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు