6 గంట‌ల్లో ఛార్మి విచార‌ణ పూర్తి!

6 గంట‌ల్లో ఛార్మి విచార‌ణ పూర్తి!

టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో సిట్ అధ‌కారుల విచార‌ణ ఏడో రోజుకు చేరింది. ఈ రోజు హీరోయిన్ ఛార్మి సిట్ అధికారుల ముందు హాజ‌ర‌య్యారు. సిట్ అధికారుల విచార‌ణ తీరుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఛార్మి హైకోర్టుకు వెళ్ల‌డంతో ఆమె విచార‌ణ‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఛార్మి ఉద‌యం 10 గంట‌ల‌కు సిట్ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఆమెను దాదాపు 6 గంట‌ల‌పాటు సిట్‌ అధికారులు విచారించారు. ఛార్మి తన వెంట్రుకలు, గోళ్లు, రక్తం నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె నుంచి ఎలాంటి శాంపిల్స్‌ సేకరించలేదని సిట్‌ అధికారులు తెలిపారు.

హైకోర్టు ఆదేశాల ప్ర‌కార‌మే నలుగురు మహిళా అధికారుల బృందం ఛార్మిని ప్ర‌శ్నించింది. సాయంత్రం 5 గంటలలోపే చార్మిపై సిట్‌ విచారణ ముగిసింది. ఛార్మి వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు రికార్డు చేసుకున్నారు. అవ‌స‌ర‌మైతే మరోసారి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా ఛార్మి నుంచి  ప‌లు కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే, ఉద‌యం కాస్త టెన్ష‌న్ గా క‌నిపించిన ఛార్మి విచారణ అనంతరం ఉల్లాసంగా మీడియాకు చేతులు ఊపుతూ వెళ్లిపోవడం గమనార్హం.

తొలుత ఆమె కుటుంబ నేపథ్యం, సినీరంగ ప్రవేశం తదితర అంశాలను ప్రస్తావిస్తూ క్రమంగా మాదకద్రవ్యాల అంశంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కెల్విన్‌తో ఛార్మికి ఉన్న సంబంధాలపైనే సిట్‌ ప్రశ్నించినట్టు అనేక చానెళ్ల‌లో వార్త‌లు వ‌చ్చాయి. 'జ్యోతిలక్ష్మి' సినిమా వేడుకలో కెల్విన్‌ పాల్గొన్న ఫొటోలను చూపించి.. ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కెల్విన్ ఫోన్లో ఛార్మి పేరు ఛార్మి దాదా అని సేవ్ చేసి ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రి మ‌ధ్య వెయ్యికి పైగా వాట్సాప్ సందేశాలు సాగిన‌ట్లుగా స‌మాచారం. వారిద్ద‌రి మ‌ధ్య సుదీర్ఘ సంభాష‌ణ‌ల వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది ఆస‌క్తి రేపుతోంది.

కెల్విన్‌తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? మీరు డ్రగ్స్‌ తీసుకుంటారా? పబ్‌లకు వెళుతారా? పబ్‌ల్లో డ్రగ్స్‌ సంస్కృతిపై మీ అభిప్రాయం ఏమిటి? టాలీవుడ్‌లో డ్రగ్స్‌ అలవాటు ఎవరెవరికి ఉంది? తదితర ప్రశ్నలను సిట్‌ అధికారులు చార్మికి వేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో సంబంధాల గురించి కూడా ఆరాతీసినట్టు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. పూరీ జగన్నాథ్‌, సుబ్బరాజు, శ్యాం కె. నాయుడు, తరుణ్‌, చిన్నా, నవదీప్‌ల త‌ర‌హాలోనే ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. రేపు విచారణకు ముమైత్‌ ఖాన్‌ హాజరవుతారని సిట్‌ అధికారులు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు