దీదీకి క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

అవును మీరు చదివింది నిజమే. కాకపోతే క్షమాపణలు చెప్పింది మొదటినుండి బీజేపీలోనే ఉన్న నేతకాదు. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నుండి కమలంపార్టీలో చేరిన సోనాలి గుహ అనే సీనియర్ నేత. నాలుగుసార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గుహ ఎన్నికలకు ముందు మమతాబెనర్జీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు.

అయితే వివిధ కారణాల వల్ల గుహ అక్కడ ఇమడలేకపోయారట. అందులోను మమత హ్యాట్రిక్ విజయం సాధించారు కదా. ఇక చెప్పేదేముంది తాజాగా గుహ దీదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో క్షమాపణలు చెప్పుకున్నారు. అచ్చంగా ఏపి రాజకీయాల్లో జరిగినట్లే అక్కడ కూడా జరుగుతోంది. వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో చాలామంది మళ్ళీ వైసీపీలో చేరటానికి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పుకున్నట్లే.

తాను బీజేపీలో ఇమడలేకపోతున్నట్లు గుహ తెగ బాధపడిపోయారు. దీదీని వదిలి ఉండలేకపోతున్నట్లు తన బాధనంతా చెప్పుకున్నారు. దీదీ క్షమించేస్తే ఎప్పుడెప్పుడు పార్టీలో మళ్ళీ చేరిపోదామా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకున్నారు. బీజేపీలో చేరిన తనతో మమతను తిట్టిద్దామని కమలంనేతలు ప్రయత్నాలు చేసినా తాను మాత్రం దీదీని ఒక్కమాట కూడా అనలేదని గుర్తుచేశారు.

తృణమూల్ ను వీడి బీజేపీలో చేరి తాను తప్పుచేశానని తన శేషజీవితమంతా దీదీ సేవలోనే గడిపేస్తానని హామీ కూడా ఇచ్చారు. గుహ రాసిన లేఖ బాగానే ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో మమత ఓడిపోయి బీజేపీ గెలిచుంటే అప్పుడు గుహ ఇదే విధంగా బీజేపీలో చేరినందుకు పశ్చాత్తాపం వ్యక్తంచేసేవారేనా ? మొత్తంమీద మమత హ్యాట్రిక్ విజయంతో తృణమూల్ ఫిరాయింపుల్లో పశ్చాత్తాపం మొదలైనట్లే ఉంది. గుహతో పాటు మరో 28 మంది ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు కూడా బీజేపీలోకి ఫిరాయించారు. మరి మిగిలిన వాళ్ళు ఏమి చేస్తారో చూద్దాం.