ఎన్టీఆర్‌ చెప్పిందేంటి, వీళ్లు చేసేదేంటి?

ఎన్టీఆర్‌ చెప్పిందేంటి, వీళ్లు చేసేదేంటి?

'బిగ్‌బాస్‌' వన్‌ వీక్‌ పర్‌ఫార్మెన్స్‌ని రివ్యూ చేస్తూ వీకెండ్‌లో ఎన్టీఆర్‌ తన పార్టిసిపెంట్స్‌కి సుతిమెత్తగా చీవాట్లు పెట్టాడు. ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తోన్న మధుప్రియతో కన్నీళ్లు విలువైనవి, వృధా చేయకు అని చెప్పాడు. కాస్త నీట్‌గా, ప్రెజెంటబుల్‌గా వుండమని సింగర్‌ కల్పనకి సున్నితంగా చురకేసాడు. ఈ గేమ్‌ని రసవత్తరంగా మార్చేందుకు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఎన్టీఆర్‌ చెప్పాడు.

అయితే ఫస్ట్‌ ఎలిమినేషన్‌ అయిపోయి, ఎన్టీఆర్‌ ఎపిసోడ్‌ కాగానే కథ మళ్లీ మొదటికి వచ్చింది. మధుప్రియ షరా మామూలుగా ఏడుపు కంటిన్యూ చేస్తోంది. కల్పన తన వాటం ఏమాత్రం మార్చుకోకపోగా, కొత్తగా ఆటిట్యూడ్‌ చూపిస్తూ నరకం చూపిస్తోంది. ఇక సంపూర్ణేష్‌ బాబు అయితే 'క్లాస్ట్రఫోబియా'కి గురయ్యానంటూ అర్ధాంతరంగా షో వదిలేసి పోయాడు. ముమైత్‌ ఖాన్‌ అయితే చిన్న దానికి వెక్కి వెక్కి ఏడ్చేసి ప్రేక్షకులు బిత్తరపోయేట్టు చేసింది.

దీనిని హిట్‌ చేసేందుకు విఫలయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయి. ప్రతి బ్రేక్‌ తర్వాత ఒక గొడవ జరుగుతూ వుండడం, ప్రతి రోజు ఎపిసోడ్‌ ముగిసే ముందు తర్వాతి రోజులో ఏదో ఒక పెద్ద ఇష్యూ జరగడం చూస్తుంటే ఇదంతా స్క్రిప్టెడ్‌ అనిపిస్తోంది. చివరకు సంపూర్ణేష్‌ ఎలిమినేషన్‌ కూడా డ్రామానే తలపించింది. ఆ హౌస్‌లో వుండడం మాటలు కాదు అనే భ్రమ కల్పించడానికి చేసిన తంతులా వుంది.

వేరే ఎవరిని పంపేసినా టాపిక్‌ అవదు కనుక సంపూని ఎంచుకుని పంపేసినట్టున్నారనే కామెంట్లు పడుతున్నాయి. ఏదేమైనా తమిళ బిగ్‌బాస్‌ నానాటికీ రసవత్తరంగా మారుతూ వుంటే తెలుగు బిగ్‌బాస్‌ మాత్రం సరైన కంటెస్టెంట్లు లేక సోమవారమే శనివారం కోసం ఎదురు చూసే పరిస్థితి కల్పిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు