మల్టీస్టారర్ తుస్సుమన్నట్లేనా?

మల్టీస్టారర్ తుస్సుమన్నట్లేనా?

తెలుగులో తొలిసారి నలుగురు యువ కథానాయకులు కలిసి నటించిన సినిమా అంటూ ‘శమంతకమణి’ విషయంలో చాలా హడావుడే చేశారు. ‘భలే మంచి రోజు’ లాంటి మంచి థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దీన్ని డైరెక్ట్ చేయడం.. సందీప్ కిషన్-నారా రోహిత్-సుధీర్ బాబు-ఆది కలిసి నటించడం.. రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ కీలక పాత్ర చేయడం.. భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం.. అన్నింటికీ మించి విడుదలకు ముందు చేసిన క్రియేటివ్ ప్రమోషన్ ‘శమంతకమణి’పై జనాల్లో బాగానే ఆసక్తి రేకెత్తించింది. సినిమాపై అంచనాలు పెట్టుకునేలా చేసింది. కానీ సినిమా అయితే అనుకున్న స్థాయిలో లేదు.

అయినప్పటికీ ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేసి వీకెండ్ వరకు బాగానే బండి నడిచేలా చేశారు. కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత సినిమా గురించి డిస్కషనే లేదు. వసూళ్లూ పడిపోయాయి. ముందు వారం వచ్చిన ‘నిన్ను కోరి’నే దీని కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. వీకెండ్లో.. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. ఈ వారాంతంలో ‘ఫిదా’ సినిమా గట్టిగా బాక్సాఫీస్‌ను తాకడంతో ‘శమంతకమణి’ థియేటర్ల నుంచి లేచిపోయింది.

తొలి రోజే ‘ఫిదా’కు సూపర్ హిట్ టాక్ రావడంతో మరుసటి రోజు థియేటర్లు పెంచారు. చాలా చోట్ల ‘శమంతమణి’ని లేపేసి ‘ఫిదా’ వేసేసిన పరిస్థితి. అప్పటికే వసూళ్లు అంతంతమాత్రంగా ఉండటంతో అభ్యంతరాలేమీ వ్యక్తం కాలేదు. నలుగురు హీరోలు కలిసి నటించడం.. కొంచెం క్వాలిటీగానే సినిమాను తీయడంతో ఈ చిత్రానికి బడ్జెట్ బాగానే అయింది. అమ్మకాలు ఆమేరకే జరిగాయి. వసూళ్లు చూస్తే అనుకున్న స్థాయిలో రాలేదు. సినిమా బ్రేక్ ఈవెన్‌కు రాలేదని అంటున్నారు. మొత్తానికి నలుగురు హీరోల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనుకుంటే.. ఇది ఒక మామూలు సినిమాలా మిగిలిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు