కంగనా తిక్క.. మరీ ఈ రేంజిలోనా?

కంగనా తిక్క.. మరీ ఈ రేంజిలోనా?

బాలీవుడ్లో ఇప్పుడున్న హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లలో మోస్ట్ ఔట్ స్పోకెన్ ఎవరు అంటే మరో మాట లేకుండా కంగనా రనౌతే పేరు చెప్పేయొచ్చు. అవతల ఉన్నది ఎంతటి వారని కూడా చూడకుండా ఏమైనా అనేయగల తెగువ ఈ అమ్మాయి సొంతం. హిపోక్రసీ.. ఎక్కువగా ఉండే ఫిలిం ఇండస్ట్రీలో.. కంగనా రనౌత్ వివిధ అంశాలపై స్పందించే తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.

తనకేమనిపిస్తే అది అనేసే కంగనా.. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. చాలామంది శత్రువుల్ని తయారు చేసి పెట్టుకుంది. బాలీవుడ్లో ‘నెపోటిజం’ అనే అంశం మీద ఆమె గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేసింది. కరణ్ జోహార్ షోకు వెళ్లి అతడితో పాటు బాలీవుడ్లో ఉన్న వారసులందరి మీదా సెటైర్లు గుప్పించింది. దీనిపై ఇటీవలే ఐఫా వేడుకల్లో కొందరు వారసత్వ హీరోలు జోకులు పేల్చడం.. తర్వాత సారీ చెప్పడం.. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా కంగనకు వారసుల తరఫున సారీ చెబుతూ తన బ్లాగులో ఒక వ్యాసం రాయడం జరిగాయి.

ఐతే తప్పు చేసిన వాళ్లు సారీ కూడా చెప్పేశాక కంగనా సైలెంటైపోవచ్చు కదా. కానీ అలా ఉండలేదు. మళ్లీ ఈ వారసులందరినీ ఏకేస్తూ ఒక ప్రకటన ఇచ్చింది. అందులో వారసులందరినీ టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నటన తన రక్తంలో ఉందంటూ సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యల్ని ఆమె తప్పుబట్టింది. తన తండ్రి రైతు అని.. మరి తన బ్లడ్‌లో వ్యవసాయం ఉందా.. తాను రైతు అయ్యానా అని ఆమె ప్రశ్నించింది.

సత్యజిత్ రే.. దిలీప్ కుమార్ లాంటి దిగ్గజాల నేపథ్యమేంటి.. వాళ్లు తమ కుటుంబాల వారసత్వాన్ని కొనసాగించకుండా సినిమాల్లోకి ఎలా రాగలిగారు అని ప్రశ్నించింది. ఇంకా అనేక ఉదాహరణలు జోడిస్తూ.. బాలీవుడ్లో నెపోటిజం మీద విమర్శలు గుప్పించింది. దేనికైనా టాలెంటే ముఖ్యమని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు సరైనవే కావచ్చు కానీ.. ఒక అంశాన్ని మరీ ఇంతగా లాగాల్సిన అవసరమైతే లేదు. ఇప్పుడు కంగనకు డిమాండ్ ఉంది కాబట్టి ఓకే. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. హిట్లు తగ్గొచ్చు.. డిమాండ్ పోవచ్చు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. ఈలోపు అదే పనిగా గొడవలు పెట్టుకుంటూ.. శత్రువుల్ని పెంచుకుంటూ వెళ్లడం అవసరమా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు