విడుదలకు మూడు వారాల ముందే సినిమా లీక్

 విడుదలకు మూడు వారాల ముందే సినిమా లీక్

ఒకప్పుడు సినిమా రిలీజైన కొన్ని వారాలకు పైరసీ ప్రింట్లు బయటికి వచ్చేవి. గత పైరసీ ముఠాలు అప్ గ్రేడ్ అయ్యాయి. విడుదలైన రోజే పైరసీ వెర్షన్లను రెడీ చేసేయడంలో నిష్ణాతులైపోయారు. అందుకు తగ్గ వ్యవస్థల్నికూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే పెద్ద బాధగా ఉంటే.. ఈ మధ్య సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే ఆన్ లైన్లోకి వచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలుగులో ‘అత్తారింటికి దారేది’ సినిమా అలాగే లీకైన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే కోవలో బాలీవుడ్లో ఓ సినిమా విడుదలకు మూడు వారాల ముందే లీక్ అయిపోవడం సంచలనం రేపుతోంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ ఈ ప్రమాదంలో పడింది.

ఎలా లీకైంది ఏంటన్న వివరాలు తెలియవు కానీ.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా మూడు వారాల ముందే బయటికి వచ్చేసిందన్న సమాచారం దర్శకుడు రెమో డిసౌజాకు తెలిసింది. అతను చేస్తున్న ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో కొందరు యువకులు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమా గురించి డిస్కస్ చేస్తుండటం.. ల్యాప్ టాప్ లోంచి ఒక్కొక్కరుగా సినిమాను పెన్ డ్రైవ్‌ల్లో ఎక్కించుకుంటుండటం గమనించిన డిసౌజా వెంటనే చిత్ర బృందానికి దీనిపై సమాచారం అందించాడు.

వెంటనే నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పైరసీని అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అభిమానులు ఆందోళన చెందొద్దని.. పైరసీకి సంబంధించి ఏ సమాచారం ఉన్నా చెప్పాలని సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్ పిలుపునిచ్చాడు. మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ స్ఫూర్తితో మరుగుదొడ్ల ప్రాధాన్యాన్ని చెబుతూ సరదాగా, సెటైరికల్‌గా తెరకెక్కించిన సినిమా ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’. శ్రీ నారాయణ్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు