బాలయ్య పై అసహనమా వంశీ?

బాలయ్య పై అసహనమా వంశీ?

కృష్ణవంశీని ‘రైతు’ గురించి అడిగితే..

కృష్ణవంశీ వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయిన సమయంలో రామ్ చరణ్ పిలిచి ఆయనకు అవకాశమివ్వడం.. ‘గోవిందుడు అందడివాడేలే’ సినిమా చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ సినిమా ఆడకపోయినప్పటికీ బాలయ్యతో ‘రైతు’ చేసే అవకాశం కృష్ణవంశీకి దక్కడం మరింత ఆశ్చర్యం కలిగించిన విషయం. ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో సినిమాకు కథ సిద్దమైంది. నిర్మాత కూడా రెడీ అయ్యాడు. అన్నీ ఓకే అయ్యాయి. కానీ ఏం లాభం..? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా.. సినిమాకు అన్నీ సిద్ధమైనా అమితాబ్ బచ్చన్ అడ్డం పడిపోయాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను అమితాబ్ బచ్చన్‌తో చేయించాలన్న బాలయ్య పట్టుదల కృష్ణవంశీ ఆశలకు గండి కొట్టింది.

బాలీవుడ్లోనే తన దగ్గరికి వస్తున్న ఎన్నో కథల్ని తిరస్కరిస్తూ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు అమితాబ్. తన దగ్గరికి ఎన్నో మంచి కథలు.. అద్భుతమైన పాత్రలు వస్తున్నప్పటికీ అన్నింట్లోనూ చేయలేకపోతున్నానంటూ ఈ మధ్య అమితాబ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘రైతు’లో ఆయనది చిన్న పాత్రే అయినప్పటికీ పచ్చజెండా ఊపలేదు.

కృష్ణవంశీ గురువు రామ్ గోపాల్ వర్మ రికమండేషన్ కూడా పని చేయలేదు. బాలయ్య మాత్రం అమితాబే అని పట్టుబట్టి కూర్చున్నాడు. దీంతో ‘రైతు’ ముందుకు కదల్లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీని ‘రైతు’ గురించి అడిగితే.. ఒకరకమైన అసహనం.. నిస్సహాయత వ్యక్తం చేశాడు. సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్‌ను అడిగామని.. ఆ పాత్ర ఆయన చేస్తేనే ‘రైతు’ చేద్దామని బాలకృష్ణ స్పష్టం చేశాడని.. ఇక చేసేదేమీ లేదని అన్నాడు కృష్ణవంశీ.

ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే అమితాబ్ విషయంలో బాలయ్య మరీ అంత పట్టుబట్టి కూర్చోవడం ఇష్టం లేనట్లుంది. ఒక పరభాషా నటుడు ఓ అతిథి పాత్రను చేయకపోవడంతో ఓ పెద్ద ప్రాజెక్టు ఆగిపోవడం అన్నది అరుదైన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు