నాగ్ ఓకే చెప్పలేదు.. మరి హృతిక్?

నాగ్ ఓకే చెప్పలేదు.. మరి హృతిక్?

మలయాళ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా అంటే రూ.50 కోట్లు ఉండొచ్చేమో. తెలుగు.. తమిళ సినిమాలు ఎప్పుడో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసి.. ఇంకా ముందుకు దూసుకెళ్తుంటే.. మలయాళంలో మాత్రం గత ఏడాది మోహన్ లాల్ సినిమా ‘పులి మురుగన్’ తొలిసారి రూ.100 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది. దీన్ని బట్టే మలయాళ సినిమాలు.. అక్కడి హీరోల మార్కెట్ పరిధి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో మలయాళ ప్రధానంగా రూ.1000 కోట్లతో సినిమా తెరకెక్కించే ప్రయత్నం జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీ కుమార్ దర్శకత్వంలో మోహన్ లాల్ భీముడి పాత్రలో మహాభారత కథతో బీఆర్ శెట్టి అనే యూఏఈ బేస్డ్ బిజినెస్ మ్యాన్ వెయ్యి కోట్లతో సినిమా తీసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే కేవలం మలయాళ మార్కెట్‌ను నమ్ముకుంటే ఈ సినిమాను వర్కవుట్ చేయడం కుదరదు కాబట్టి.. పలు భాషల నుంచి పేరున్న నటీనటుల్ని ఎంచుకోవాలని చూస్తోంది చిత్ర బృందం. ఇలా పలు భాషల నటుల్ని తీసుకుని దీన్ని ‘ఇండియన్ సినిమా’గా మలిచి.. దేశవ్యాప్తంగా పలు భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అందుకే ప్రతి భాష నుంచి పేరున్న నటీనటుల్ని ముఖ్య పాత్రలకు అడుగుతున్నారు.

ఇప్పటికే నాగార్జునను ఓ పాత్రకు అడగ్గా.. ఈ ప్రాజెక్టు మీద ఆయనకు గురి కుదరక హోల్డ్‌లో పెట్టారు. నాగ్ సంగతి తేలకుండానే ఇప్పుడు ఈ చిత్రంలో కర్ణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్‌ను అడుగుతున్నారట. అతడితో సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే అని చిత్ర బృందం తెలిపింది. మరి హృతిక్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. అతను ఓకే అంటే మాత్రం హిందీలో ఈ సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు