చిరంజీవిపై సినిమా.. నేనే తీస్తా

చిరంజీవిపై సినిమా.. నేనే తీస్తా

ఆ మధ్య ‘మిస్టర్’ సినిమా ఆడియో వేడుకలో సీనియర్ నటుడు బెనర్జీ మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడటం గుర్తుండే ఉంటుంది. చిరంజీవి జీవితం.. సినీ రంగంలో ఆయన ఎదుగుదల అసాధారణమని.. ఆయన ఎందరికో స్ఫూర్తి అని.. చిరంజీవి బయోపిక్ తీస్తే అద్భుతంగా ఉంటుందని అన్నాడు బెనర్జీ అప్పుడు. ఐతే అప్పుడేదో అలా మాట్లాడేసి ఊరుకోకుండా ఈ బయోపిక్ మీద సీరియస్ గానే కనిపిస్తున్నాడు బెనర్జీ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చిరు బయోపిక్ మీద మాట్లాడారు. కుదిరితే తానే ఆ సినిమా తీస్తానన్నాడు.

‘‘తెలుగు పరిశ్రమలోనే కాదు.. మొత్తం ఇండియాలో అసలేమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇంత పెద్ద స్టార్ అయిన నటుడు ఒక్క చిరంజీవి మాత్రమే. ఆయన ఎదుగుదల అసాధారణం. ఆయన ఎంత కష్టపడింది.. ఎంత బాధపడింది.. అన్నీ నేను దగ్గరుండి చూశాను. అందుకే ఆయన జీవితమే ఒక స్ఫూర్తి.  సినిమా తీస్తే అద్భుతంగా వస్తుంది. నటులు కావాలనుకునే ఎంతో మందికి చిరంజీవి జీవితం ఆదర్శం. సినిమా ఇండస్ట్రీలో చిన్న అలగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం మహాసముద్రంలా ఉప్పొంగింది. ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకొంటే ఆ సినిమాను నేనే డైరెక్ట్ చేస్తా. నటుడిగా కెరీర్ మొదలుపెట్టక ముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. కాబట్టి చిరంజీవిపై సినిమాను నేను బాగానే తీయగలనని అనుకుంటున్నా’’ అని బెనర్జీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు