'బాహుబలి'లో రమ్యకృష్ణపై కృష్ణవంశీ ఫీలింగేంటి?

'బాహుబలి'లో రమ్యకృష్ణపై కృష్ణవంశీ ఫీలింగేంటి?

'బాహుబలి' సినిమాలో శివగామి పాత్రతో రమ్యకృష్ణకు ఎంత గొప్ప పేరొచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ఆమెను పొగిడేవాళ్లే తప్ప విమర్శలు గుప్పించిన వాళ్లు లేరు. 'బాహుబలి'ని బలంగా నిలబెట్టిన పాత్రల్లో శివగామి ఒకటనడంలో సందేహం లేదు.

ఐతే రమ్యకృష్ణ నటన మీద ఎంతోమంది ప్రశంసలు కురిపించారు కానీ.. ఆమె భర్త కృష్ణవంశీ ఇప్పటిదాకా ఒక్కసారీ భార్య పాత్ర గురించి.. ఆమె నటన గురించి.. 'బాహుబలి' గురించి స్పందించింది లేదు. ఐతే తన కొత్త సినిమా 'నక్షత్రం' ప్రమోషన్లలో భాగంగా రమ్య గురించి స్పందించాడు కృష్ణవంశీ.

''బాహుబలి సినిమాలో శివగామి పాత్ర రాసిన రచయితను.. ఆ పాత్రను బాగా చూపించిన దర్శకుడిని ముందుగా అభినందించాలి. ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చిందంటే అది ప్రధానంగా వాళ్ల ఘనతే. రమ్యకృష్ణ కూడా అద్భుతంగా నటించిందన్నది వాస్తవం. ఆమె మంచి నటి. అమ్మోరు, నరసింహా లాంటి సినిమాలతో తనేంటో ఎప్పుడో రమ్య రుజువు చేసుకుంది'' అని కృష్ణవంశీ అన్నాడు.

మరి అంత మంచి నటి అయిన రమ్యకృష్ణను పెళ్లయ్యాక మీ సినిమాల్లో పెట్టుకోవట్లేదేంటి అని అడిగితే.. ''నేను ఆమెను ఒక ఆర్టిస్టుగా చూడలేను. తనను చూస్తే పర్సనల్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అందుకే ఆమెను నా సినిమాల్లో పెట్టుకోవట్లేదు. ఇక ముందు కూడా రమ్య నా సినిమాల్లో నటించదు'' అని కృష్ణవంశీ స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు