హరీష్‌ ఇక ఆపేస్తే బెటర్‌

హరీష్‌ ఇక ఆపేస్తే బెటర్‌

తన కెరియర్‌ని ప్రభావితం చేసే చిత్రం కనుక, తన ఫ్యూచర్‌ని డిసైడ్‌ చేసే మూవీ కనుక 'డీజే' విషయంలో హరీష్‌ శంకర్‌ కొంచెం ఎక్కువ ఉత్సాహ పడడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ థియేటర్ల నుంచి నిష్క్రమిస్తోన్న ఈ చిత్రం రిజల్ట్‌ ఏమిటనేది జగద్విదితం. ఈ చిత్రానికి అల్లు అర్జున్‌కి వున్న క్రేజ్‌ రీత్యా, బాహుబలి తర్వాత పెద్ద సినిమాలు లేని కారణం రీత్యా, రంజాన్‌ సెలవు రీత్యా ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి.

ఒక్కసారి రంజాన్‌ హాలిడే అవగానే ముసుగుతన్ని పడుకున్న 'డీజే' బాక్సాఫీస్‌ వద్ద నాలుగు రోజుల సినిమా అయింది. పోటీ లేని వాతావరణంలో కొనసాగుతున్నప్పటికీ నెల తిరగకుండా థియేటర్ల నుంచి మాయమవుతోంది. అల్లు అర్జున్‌ హిట్‌ సినిమాకి, ఈ సినిమాకీ మధ్య వ్యత్యాసం ఏమిటనేది అందరికీ తెలుసు. చివరకు అల్లు అర్జున్‌ కూడా ఈ చిత్రం విషయంలో సైలెంట్‌ అయి తదుపరి సినిమా పనుల్లో బిజీ అయ్యాడు.

అయితే హరీష్‌ శంకర్‌ మాత్రం ఇప్పటికీ తన సినిమా హిట్టేనంటూ ఫలానా వారి సాక్ష్యమిదిగో అంటూ ఎప్పటికప్పుడు తన గోడు వినిపిస్తున్నాడు. పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఇది సరైనోడు కంటే పెద్ద హిట్‌ అంటూ దిల్‌ రాజు చెప్పిన వీడియోని చూపించి నమ్మండంటున్నాడు. భారీ నష్టాలు రాకపోయినా, నష్టాలతోనే వెళ్లిపోతున్న డీజేని ట్రేడ్‌ టర్మ్స్‌లో యావరేజ్‌ అనవచ్చు. కానీ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ఫ్లాపే.

ఇకనైనా ఈ పరాజయాన్ని అంగీకరించి తదుపరి చిత్రంపై దృష్టి పెడితే మంచిది. హీరోకున్న క్రేజ్‌ వల్ల ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న సినిమాని చూపించి తన ఘనతేనని గట్టిగా చెబుతూ వుంటే సదరు దర్శకుడిపై గౌరవం తగ్గే ప్రమాదం వుంది. 'నెక్స్‌ట్‌ ఏంటి?' అనే దానిపై ఫోకస్‌ పెట్టి దీనిని ఇంతటితో వదిలేస్తే సరి. వన్స్‌ రిజల్ట్‌ అవుట్‌ అయ్యాక ఇక దాని గురించి ఎంత రుద్దినా జనం, మీడియా వినవు కనుక ఈ ఎఫర్ట్‌ ఏదో తదుపరి తీసే సినిమా కథపై పెడితే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు