ఈ చీప్ పబ్లిసిటీ.. అవసరమా?

ఈ చీప్ పబ్లిసిటీ.. అవసరమా?

ఈ మధ్య బాలీవుడ్ భామ స్వర భాస్కర్ నటించిన ‘అనార్కలి ఆఫ్ ఆరా’ అనే సినిమాలోని న్యూడ్ సీన్ ఒకటి ఆన్ లైన్లో హల్ చల్ చేసింది. ఐతే అది సెన్సార్ వాళ్లు కోత పెట్టిన సీన్ అని అన్నారు. కానీ అది ఆన్ లైన్లోకి ఎలా వచ్చిందన్నదే ఎవరికీ అర్థం కాలేదు. తాము కోత పెట్టిన సన్నివేశాన్ని సెన్సార్ వాళ్లే లీక్ చేసేంత సీన్ ఉండదు. ఆ చిత్ర యూనిట్ సభ్యులే పబ్లిసిటీ కోసం ఆ సీన్‌ను లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. జనాలు కూడా అది వాస్తవమే అయ్యుండొచ్చనుకున్నారు.

ఇప్పుడు ‘దండుపాళ్యం-2’ సినిమా విషయంలో జరుగుతున్న తంతు కూడా ఇలాగే అనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ సంజన నటించిన నగ్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్ లైన్లో వైరల్ అవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో కుర్రాళ్లు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. ఈ సీన్ ఎలా లీకైందో తమకు తెలియదని అంటోంది చిత్ర బృందం. ఈ సీన్ కూడా సెన్సార్ వాళ్లు కోత పెట్టిందే అంటున్నారు. ‘దండుపాళ్యం’ సూపర్ హిట్టయినప్పటికీ.. దీనికి కొనసాగింపుగా శ్రీనివాసరాజు తీసిన సినిమాపై ప్రేక్షకుల్లో అంత ఆసక్తేమీ కనిపించట్లేదు.

ఈ సినిమా విడుదల అనుకున్న ప్రకారం జరగలేదు. చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ శుక్రవారమే ‘దండుపాళ్యం-2’ను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు హైప్ తేవడానికి చిత్ర బృందం ఈ సన్నివేశాన్ని లీక్ చేసి చీప్ పబ్లిసిటీ పొందుదామని చూస్తున్నట్లుగా ఉంది. ఐతే లీకైన సన్నివేశం చూస్తే ఇందులో అడల్ట్ డోస్ మరీ ఎక్కువైపోయిందని.. తొలి భాగంతో పోలిస్తే దీన్ని దర్శకుడు మరింత పచ్చిగా తీశాడని అర్థమవుతోంది. మరి ఈ పబ్లిసిటీ కలిసొచ్చి ‘దండుపాళ్యం-2’ కూడా జనాల దృష్టిని ఆకర్షించి.. హిట్టవుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు