మహేష్‌, పవన్‌ ఏమీ దేవుళ్లు కాదుగా?

మహేష్‌, పవన్‌ ఏమీ దేవుళ్లు కాదుగా?

మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ ఓవర్సీస్‌ మార్కెట్‌లో కింగ్సే. డిజాస్టర్‌ చిత్రాలతోను ఓవర్సీస్‌లో మిలియన్‌ డాలర్లకి పైగా వసూళ్లు తీసుకురాగల సమర్ధులే. అయితే మిలియన్‌ డాలర్లు వచ్చినంత మాత్రాన వారి సినిమాలు కొన్న బయ్యర్లు గట్టెక్కరు. వీళ్ల చిత్రాలపై పది కోట్ల పెట్టుబడి పెడితే కనీసం యుఎస్‌ నుంచి రెండు మిలియన్లు వసూలయితే, మిగతా దేశాల నుంచి వచ్చే వసూళ్లతో బ్రేక్‌ ఈవెన్‌ అవ్వవచ్చు.

కానీ ఫ్లాప్‌ అయిన సినిమాలతో రెండు మిలియన్లు రావు. ఎంత క్రేజ్‌ వున్న సినిమా అయినా కానీ ఇరవై కోట్ల పెట్టుబడి పెట్టడానికి అయితే ఇప్పుడు ఓవర్సీస్‌ బయ్యర్లు సిద్ధంగా లేరు. ఇరవై కోట్లకి ఒక సినిమా కొంటే యుఎస్‌లో కనీసం నాలుగు మిలియన్ల వసూళ్లు రావాలి. బాహుబలి తప్ప ఇంతవరకు మరో సినిమా ఆ ఫీట్‌ చేయలేదు.

దీంతో మహేష్‌ స్పైడర్‌కి మురుగదాస్‌ వున్నా, పవన్‌ చిత్రానికి త్రివిక్రమ్‌ వున్నా ఓవర్సీస్‌లో ఇంకా బిజినెస్‌ క్లోజ్‌ అవలేదు. నిర్మాతలు అడిగే రేట్లకి కొనడానికి బయ్యర్లు ముందుకి రావడం లేదు. అన్ని కోట్లకి సినిమా కొంటే టాక్‌ ఏమాత్రం తేడా వచ్చినా రికవర్‌ చేయడానికి వాళ్లేమీ దేవుళ్లు కాదుగా అనేది అక్కడి బయ్యర్ల ఆర్గ్యుమెంట్‌.

అయినా ఇరవై కోట్లు పెట్టి హక్కులు తీసుకుంటే మహా అయితే కోటి, రెండు కోట్ల లాభాలు చవిచూడవచ్చునని, దాని కోసం అంత రిస్కు చేయాల్సిన పని లేదని అంటున్నారట. రిలీజ్‌కి దగ్గర పడితే బయ్యర్లే ఎగబడతారని నిర్మాతలు, రిలీజ్‌కి దగ్గరయ్యే కొద్దీ నిర్మాతలే దిగి వస్తారని బయ్యర్లు ఇప్పుడు ఎవరికి వారు బిడాయించుకు కూర్చున్నారు.