పవన్‌ను దాటేసి.. ఎన్టీఆర్‌ను సమం చేశాడు

పవన్‌ను దాటేసి.. ఎన్టీఆర్‌ను సమం చేశాడు

సినిమా సినిమాకూ రేంజి పెంచుకుంటున్నాడు నాని. తెలుగు రాష్ట్రాల్లో అతడి ఫాలోయింగ్ గత రెండేళ్లలో అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అతడి మార్కెట్ రూ.25-30 కోట్ల మధ్య ఉండటం విశేషం. కాబట్టి కచ్చితంగా అతణ్ని స్టార్ అనే పిలవాలిక. తెలుగు రాష్ట్రాల వరకైతే నాని స్టారే కానీ.. ఓవర్సీస్ మార్కెట్లో అతడి ఫాలోయింగ్ చూస్తే 'సూపర్ స్టార్' అనాల్సిందే.

ఎందుకంటే ఓవర్సీస్‌లో మన సూపర్ స్టార్లు చాలామందికి కూడా లేని క్రేజ్ నానికి కనిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక మిలియన్ డాలర్ మూవీస్‌ ఉన్న హీరో నానినే కావడం విశేషం. ఎన్టీఆర్‌తో సమానంగా నాలుగు మిలియన్ డాలర్ మూవీస్‌ను ఖాతాలో వేసుకున్నాడు నాని.

ఐదేళ్ల కిందట రాజమౌళి సాయంతో 'ఈగ' రూపంలో తొలి మిలియన్ డాలర్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు నాని. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్' కూడా ఆ క్లబ్బులో అడుగుపెట్టింది. ఆ చిత్రం ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది.

ఇక ఈ ఏడాది ఆరంభంలో 'నేను లోకల్'తో మరోసారి ఆ క్లబ్బును టచ్ చేశాడు. తాజాగా 'నిన్ను కోరి' కూడా మిలియన్ డాలర్ మూవీ అయింది. తొలి వీకెండ్లోనే 8 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసిన 'నిన్ను కోరి'.. సెకండ్ వీకెండ్ కంటే ముందే మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. ఎన్టీఆర్‌కు బాద్‌షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌ల రూపంలో నాలుగు మిలియన్ డాలర్ మూవీస్ ఉన్నాయి.

మహేష్ బాబు ఆరు సినిమాలతో (దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానాన్ని ఎన్టీఆర్, నాని పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో (అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్) మూడో స్థానంలో ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు