ఆ చేదు గురుతులు చెరిపేస్తావా నానీ?

ఆ చేదు గురుతులు చెరిపేస్తావా నానీ?

ఈ రోజు ఉదయం తన కొత్త సినిమాలు రెండింటి గురించి వివరాలు వెల్లడిస్తానంటూ నిన్ననే హింట్ ఇచ్చాడు నేచురల్ స్టార్ నాని. అన్నట్లే ఆ విశేషాలు తన ట్విట్టర్ ఫాలోవర్లతో పంచుకున్నాడు. ఐతే అందులో ఒకటి ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమానే. దాని విశేషాలు జనాలకు తెలిసినవే. దిల్ రాజు నిర్మాణంలో 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఎంసీఏ' అనే సినిమాను కొన్ని నెలల కిందటే మొదలుపెట్టాడు నాని.

ఈ చిత్రానికి సంబంధించి నాని కొత్తగా ఇచ్చిన సమాచారం ఏమీ లేదు. షూటింగ్ ప్రోగ్రెస్ అంటూ ఈ పోస్టర్ మీద వేశారు. రిలీజ్ గురించిన సమాచారం కూడా ఏమీ ఇవ్వలేదు. ఐతే నాని దీని తర్వాత చేయబోయే సినిమా గురించి మాత్రం కొత్త విశేషాలు బయటపెట్టాడు.

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'.. 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరించాడు నాని. ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించాడు. 'కృష్ణార్జున యుద్ధం'.. ఇదీ ఆ సినిమా టైటిల్. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయబోతున్న సంగతి స్పష్టమైంది. 'నాని అండ్ నాని ఇన్..' అంటూ టైటిల్ ముందు వేయడం ద్వారా ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయబోతున్న విషయాన్ని కన్ఫమ్ చేశారు.

ఇంతకుముందు 'జెండాపై కపిరాజు'లో ద్విపాత్రాభినయం చేశాడు నాని. ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈసారి డబుల్ రోల్ తో ఆ చేదు అనుభవాల్ని నాని చెరిపేస్తాడేమో చూడాలి. 'షైన్ స్క్రీన్స్' అనే కొత్త బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'ధృవ'తో తెలుగు తెరకు పరిచయమైన తమిళ సంగీత దర్శక ద్వయం హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్నందించబోతుండటం విశేషం. 2018లో ఈ చిత్రం విడుదలవుతుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు