నక్షత్రం.. మళ్లీ కష్టమే అంటున్నారే

నక్షత్రం.. మళ్లీ కష్టమే అంటున్నారే

కృష్ణవంశీ కొత్త సినిమా 'నక్షత్రం' విడుదల గురించి ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. దీని గురించి జనాలు పట్టించుకోవడం మానేసిన సమయంలో ఉన్నట్లుండి ఏదో ఒక అప్‌డేట్‌తో వస్తారు. త్వరలోనే విడుదల అంటారు. కానీ చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయరు. గత మూణ్నాలుగు నెలల నుంచి ఇదే జరుగుతోంది.

ఈ నెలలోనే రిలీజ్ అంటూ ప్రకటించడం.. ఆ తర్వాత ఏవో కారణాలతో సినిమాను వాయిదా వేయడం.. ఇలాగే జరుగుతోంది. ఈ నెల ఆరంభంలో 'నక్షత్రం' ఆడియో వేడుక చేసి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసేసిన నేపథ్యంలో రిలీజ్ కూడా ఈ నెలలోనే ఉంటుందని అంచనా వేశారు. జులై 21న సినిమా విడుదలయ్యే అవకాశమున్నట్లు చెప్పారు.
కానీ పరిస్థితి చూస్తుంటే ఆ తేదీకి 'నక్షత్రం' రావడం కష్టమనే అనిపిస్తోంది.

సినిమాకు అనుకున్న ప్రకారం బిజినెస్ కాకపోవడంతో విడుదలకు మార్గం సుగమం కాలేదని అంటున్నారు. ఆ తేదీని వదిలేస్తే.. 'నక్షత్రం'కు చాలా కష్టమైపోతుంది. నెలాఖర్లో రెండు మూడు సినిమాలొచ్చే అవకాశాలున్నాయి. వచ్చే రెండు నెలల్లో భారీ సినిమాలు చాలా ఉన్నాయి. బెర్తులన్నీ దాదాపుగా బుక్ అయిపోయాయి. అసలే 'నక్షత్రం'కు క్రేజ్ అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో మంచి రిలీజ్ డేట్ చూసి రిలీజ్ చేయకపోతే కష్టమే.

ఈ సినిమాకు స్థాయికి మించి ఖర్చు పెట్టించేశాడట కృష్ణవంశీ. పైగా సినిమా చాలా ఆలస్యం కావడంతో ఫైనాన్స్ వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. దీంతో నిర్మాతల పరిస్థితి అయోమయంగా ఉందంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో 'నక్షత్రం'ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో.. అది ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు