మంచి ఎక్కువైంది.. అందుకే ఫ్లాపైంది

మంచి ఎక్కువైంది.. అందుకే ఫ్లాపైంది

కొన్ని సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా హిట్టయిపోతుంటాయి. ఇంకొన్ని సినిమాలేమో పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఫ్లాపవుతుంటాయి. మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నవి ఆడకపోతే ఎవ్వరికైనా బాధేస్తుంది. ముఖ్యంగా అలాంటి సినిమాలు తీసిన దర్శక నిర్మాతల బాధ మామూలుగా ఉండదు. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు గత ఏడాది. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మనమంతా’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. చూసిన వాళ్లందరూ దీని గురించి పాజిటివ్‌గానే మాట్లాడారు. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా ఫలితం తననెంతగానో నిరాశకు గురి చేసిందని సాయి కొర్రపాటి అన్నారు.

ఈ సినిమా ఆడకపోవడానికి కారణాలు చెబుతూ.. ‘‘మా ప్రయత్నం మేం చేశాం. సినిమాలో మంచి తనం మరీ ఎక్కువైపోయినా జనం చూడరేమో అనిపించింది. ఆ సినిమాలో మరీ అతి మంచితనం ఉందేమో అనిపించింది. ఎందుకంటే చూసిన వాళ్లెవ్వరూ కూడా ‘మనమంతా’ బాగా లేదని అనలేదు. కానీ చూడాల్సినంత మంది చూడలేదు. అంటే ఏదో తేడా ఉందనే అనుకోవాల్సి వచ్చింది’’ అని సాయి కొర్రపాటి అన్నారు. ఇక గత శుక్రవారం తన బేనర్ నుంచి విడుదలైన ‘రెండు రెళ్ళు ఆరు’కు కూడా తాము ఆశించిన స్పందన రాలేదని సాయి చెప్పారు. అది మంచి సినిమా అవుతుందని అనుకున్నానని.. చూసిన వాళ్లు బాగానే ఉందన్నప్పటికీ స్టార్ కాస్ట్ సరిపోలేదని అంటున్నారని.. అందు వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉందని సాయి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English