ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా- తాప్సి

ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా- తాప్సి

బాలీవుడ్ వెళ్లిపోయాక పలుమార్లు టాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడింది తాప్సి పన్ను. తన టాలెంట్ గుర్తించలేదని.. ఇక్కడ ఎక్కువగా గ్లామర్ రోల్సే ఇచ్చారని.. ఫెయిల్యూర్లకు తనను బాధ్యురాలిని చేస్తూ ఐరెన్ లెగ్ ముద్ర వేశారని.. ఇలా రకరకాలుగా వ్యాఖ్యలు చేసింది సొట్టబుగ్గల సుందరి. అంత వరకు బాగానే ఉంది కానీ.. తాజాగా ఒక షోలో భాగంగా తన తొలి చిత్ర దర్శకుడైన కె.రాఘవేంద్రరావు గురించి చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదమయ్యాయి.

కొబ్బరి కాయతో నడుం మీద కొట్టడం ఏం రొమాన్సంటూ దర్శకేంద్రుడిని తేలిక చేసి మాట్లాడే ప్రయత్నం చేసింది తాప్సి. దీనిపై ఇక్కడి జనాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చేసేటపుడు తెలియలేదా అంటూ ఆమెను తిట్టిపోశారు. సోషల్ మీడియాలో తాప్సిని ఓ రేంజిలో ట్రోల్ చేశారు తెలుగు నెటిజన్లు. ఐతే తన పట్ల అంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తాప్సి తగ్గలేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ఆమె చెప్పింది.

ఐతే తాను కంటెంట్ బేస్డ్‌గా మాట్లాడానే తప్ప రాఘవేంద్రరావును అవమానించలేదని తాప్సి స్పష్టం చేసింది. తన వ్యాఖ్యల్ని రాఘవేంద్రరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సరదాగానే తీసుకుని ఉంటారని ఆమె అంది. మరి తాప్సి వివరణ పట్ల రాఘవేంద్రరావు అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందుతారో చూడాలి. వచ్చే నెలలో విడుదల కాబోయే తన తెలుగు సినిమా ‘ఆనందో బ్రహ్మ’ ప్రమోషన్ కోసం వచ్చినపుడు మీడియా దాడిని తాప్సి ఎలా తట్టుకుంటుందన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు