బ్రేకప్ గాయాలకు నాని మందు

బ్రేకప్ గాయాలకు నాని మందు

తెలుగు సినీ చరిత్రలో భగ్న ప్రేమికుల సినిమాలు చాలా చూశాం. అవి చూస్తే హృదయాలు ద్రవించి పోతాయి. నిజ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్న వాళ్లనైతే ఆ సినిమాలు కదిలించేస్తాయి. ఆ తరహా సినిమాలు చూసి మరింత నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతుంటారు భగ్న ప్రేమికులు.

కానీ 'నిన్ను కోరి' మాత్రం ఇలాంటి ప్రేమికులకు ఒక కొత్త మార్గం సూచించేలా తెరకెక్కించడం విశేషం. బ్రేకప్ బాబులపై ఈ సినిమా కచ్చితంగా సానుకూల ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. తాజాగా ఒక అబ్బాయి 'నిన్ను కోరి' సహ నిర్మాత.. రచయిత కోన వెంకట్‌ను ఉద్దేశించి ఒక మెసేజ్ పెట్టాడు. దాన్ని ట్విట్టర్లో అందరికీ షేర్ చేశాడు కోన.

తన ప్రియురాలు దూరమయ్యాక తాను ఎంతగా మానసిక వేదన అనుభవించానో చెప్పలేనని.. 'నిన్ను కోరి' చూస్తుంటే తన జీవితమే చూస్తున్నట్లుగా అనిపించిందని.. ఐతే సినిమా చివర్లో ఇచ్చిన ముగింపు తన జీవితానికి ఒక కొత్త దారి చూపించిందని.. తన గాయాలకు మందులా ఈ సినిమా ఉందని ఉద్వేగభరితంగా మెసేజ్ పెట్టాడతను.

కోన షేర్ చేశాడని కాదు కానీ.. జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లకు.. బ్రేకప్ అయి తమ లవ్ ను ఇంకా మరిచిపోని వాళ్లకు 'నిన్ను కోరి' బాగా కనెక్టయ్యే కథే. ఇలాంటి వాళ్ల ఆలోచన తీరును మార్చి.. కొత్త జీవితం మొదలుపెట్టేందుకు స్ఫూర్తినిచ్చేలా సినిమాను అందంగా ముగించాడు కొత్త దర్శకుడు శివ నిర్వాణ. ఒక కొత్త దర్శకుడై ఉండి ఇలా పరిణతితో సినిమాను తీర్చిదిద్దినందుకు అతణ్ని అభినందించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు