సినిమాలకి పెద్ద చిల్లే పడుతోంది

సినిమాలకి పెద్ద చిల్లే పడుతోంది

జిఎస్‌టి పేరుతో రకరకాల శ్లాబులు విధించిన ప్రభుత్వం సినిమాలని లగ్జరీ కింద లెక్కేసింది. దీంతో వంద రూపాయలు పైన వుండే టికెట్‌పై ఇరవై ఎనిమిది శాతం పన్ను పడుతోంటే, వంద రూపాయల లోపు వున్న టికెట్లపై పద్ధెనిమిది శాతం పన్ను విధిస్తున్నారు. దీంతో మల్టీప్లెక్స్‌ టికెట్లపై ఇరవై ఎనిమిది శాతం పన్ను పడుతోంది.

సింగిల్‌ థియేటర్లకి పద్ధెనిమిది శాతం పన్ను పడుతోంది. దీని వల్ల వచ్చే షేర్లు గణనీయంగా తగ్గుతున్నాయి. మల్టీప్లెక్స్‌లు ఎక్కువ వుండే ప్రాంతాల్లో అయితే వచ్చే షేర్‌లో చాలా వంతు టాక్స్‌ కింద పోతోంది. జిఎస్‌టి అమల్లోకి వచ్చాక రిలీజ్‌ అయిన మొదటి మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా 'నిన్ను కోరి' కావడంతో కొత్త పన్ను ప్రభావం ఎంత వుందనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

గతంలో వచ్చే షేర్లతో పోలిస్తే కనీసం పది నుంచి పదిహేను శాతం వరకు అదనంగా టాక్స్‌ కింద పోతోంది. దీనిని అధిగమించడానికి టికెట్‌ ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద సినిమాలకి ఈ పన్ను తాకిడి మరింత బలంగా తాకుతుంది. టికెట్‌ రేట్లు పెంచని పక్షంలో ప్రస్తుతం ఆఫర్‌ చేసే రేట్ల కంటే తగ్గించి ఆఫర్‌ చేసే అవకాశాలున్నాయి.

ప్రతి జిల్లాకి కనీసం యాభై లక్షల వరకు అదనపు భారం పడుతుంది కనుక అదంతా ఓవరాల్‌గా సినిమా బిజినెస్‌కే చిల్లు పెడుతుంది. టికెట్లపై పెరిగే భారాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి సింగిల్‌ ఎంఆర్‌పిని ప్రవేశపెట్టి కూల్‌డ్రింకులు, వాటర్‌ బాటిల్స్‌ని ఎక్కువకి విక్రయించే పద్ధతిని తొలగించబోతున్నారు. అయితే దీని వల్ల క్యాంటీన్ల ఆదాయం తగ్గుతుందని కాంట్రాక్టులు తీసుకున్న వారు బావురుమంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు