ఈసారి నానిని పొగిడెందెవరో తెలుసా?

ఈసారి నానిని పొగిడెందెవరో తెలుసా?

నాని సినిమాలు చూసిన ఏ ప్రేక్షకుడైనా అతడి నటనను పొగడకుండా ఉండలేడు. నటుడిగా అంత మంచి పేరు సంపాదించి.. జనాల్లోకి చొచ్చుకుపోయాడు నాని. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది నాని మీద ప్రశంసలు కురిపించారు. ఐతే ఇప్పుడు నానికి ఓ రాజకీయ ప్రముఖుడి నుంచి ప్రశంసలు అందాయి. ఆ నేత మరెవరో కాదు.. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

ఈ మధ్య తరచుగా సినిమా వేడుకలకు వస్తూ సినిమాల గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. నాని మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ తరం అత్యుత్తమ నటుల్లో నాని ఒకడని కితాబిచ్చాడు కేటీఆర్. అతను ‘బ్రిలియంట్ పెర్ఫామర్’ అంటూ పొగిడేశాడు కేటీఆర్.

ఇంకో విశేషం ఏంటంటే.. ఈ వారంలోనే నాని సినిమాలు రెండు చూశాడట కేటీఆర్. ఆ సినిమాలేవని కేటీఆర్ చెప్పలేదు కానీ.. అందులో ఒకటి నాని లేటెస్ట్ రిలీజ్ ‘నిన్ను కోరి’ అయ్యుండొచ్చు. థియేటర్లలో ఉన్నదైతే ఈ ఒక్క సినిమానే. మరి కేటీఆర్ చూసిన మరో నాని సినిమా ఏదో.. దాన్ని ఎక్కడ చూశాడో? ఏదేమైనా రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుడు ఇలా స్వచ్ఛందంగా నాని మీద ప్రశంసలు కురిపించడం విశేషమే. ప్రస్తుతం తెలుగులో నానిని ఇష్టపడని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.

మంచి సినిమాల ఎంపికతో.. చక్కటి నటనతో.. ప్రేక్షకుల్ని అలరిస్తూ సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు ఎక్కేస్తున్నాడు నాని. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాని వ్యక్తిత్వం కూడా అతడిని మరింతగా జనాలకు చేరువ చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు