అక్కడ నాని దున్నేశాడు

అక్కడ నాని దున్నేశాడు

నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. దీని ట్రైలర్ అదీ చూసి.. ఇది క్లాస్ టచ్ ఉన్న సీరియస్ లవ్ స్టోరీ అని.. అందరికీ ఎక్కకపోవచ్చని అనుకున్నారు. సమీక్షకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కలెక్షన్లు చూస్తే కథ మరోలా ఉంది. నాని మాస్ హిట్ ‘నేను లోకల్’ కంటే కూడా దీనికి వారాంతపు వసూళ్లు ఎక్కువగా రావడంతో షాకైపోతున్నారు ట్రేడ్ పండిట్స్.

ఫస్ట్ వీకెండ్లో ‘నిన్ను కోరి’ వరల్డ్ వైడ్ గ్రాస్ దగ్గర దగ్గర రూ.25 కోట్లుగా ఉండటం అనూహ్యమైన విషయమే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ‘నిన్ను కోరి’కి మంచి వసూళ్లు వచ్చాయి. నానిపై తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఈ వసూళ్లు రుజువుగా నిలుస్తున్నాయి.

ఇక ‘నిన్ను కోరి’కి మంచి వసూళ్లు వస్తాయని ఆశించిన అమెరికాలో ఈ సినిమా అంచనాల్ని మించిపోయింది. తొలి వారాంతంలో అక్కడ ఈ సినిమా కలెక్షన్లు 8 లక్షల డాలర్ల మార్కుకు చేరువగా ఉన్నాయి. ప్రిమియర్లతో 1.6 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘నిన్ను కోరి’.. శుక్రవారం 2.25 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. శనివారం 2.75 లక్షల డాలర్లు వసూలయ్యాయి. మొత్తంగా ప్రిమియర్లతో కలిపి రెండే రోజుల్లో 6.5 లక్షల డాలర్లు వసూలు చేయడం అనూహ్యమే.

ఆదివారం 1.5-2 లక్షల డాలర్ల మధ్య వసూళ్లు ఉంటాయని అంచనా. కాబట్టి వారాంతంలోనే 8 లక్షల డాలర్లతో చాలామంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని వసూళ్లను రాబడుతున్నాడు నాని. ఈ సినిమా సెకండ్ వీకెండ్ కంటే ముందే మిలియన్ డాలర్ మార్కును అందుకునేలా ఉంది. ఫుల్ రన్లో ‘భలే భలే మగాడివోయ్’ కలెక్షన్లకు ‘నిన్ను కోరి’ చేరువగా వెళ్లే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు