రానా 'నేను ఆదేశిస్తే'

రానా 'నేను ఆదేశిస్తే'

దగ్గుబాటి రానా ఇప్పుడు కేవలం తెలుగు నటుడు కాదు.. నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న బహుభాషా నటుడు. అటు హిందీలో.. ఇటు తమిళంలోనూ అతను సినిమాలు చేస్తున్నాడు. అతను ఏ భాషలో సినిమా చేసినా.. వేరే భాషల్లోనూ అనువాదం చేసుకునే సౌలభ్యం ఉంది.

రానా లాస్ట్ మూవీ 'ఘాజీ' అలాగే మూడు భాషల్లో విడులై మంచి విజయం సాధించింది. ఇప్పుడు అతడి కొత్త సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' కూడా మూడు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రం మొదలైనపుడు తెలుగు సినిమానే కానీ.. విడుదల సమయానికి త్రిభాషా చిత్రం అయిపోయింది. తమిళం.. హిందీలోనూ పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

తాజాగా తమిళంలో ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారు చేసి ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. 'నాన్ ఆనయిట్టాల్' అనే పేరును తమిళ వెర్షన్‌కు ఖరారు చేశారు. నాన్ ఆనయిట్టాల్.. అంటే 'నేను ఆదేశిస్తే' అని అర్థం. ఈ మాట తమిళ జనాలకు చాలా ఈజీగా కనెక్టవుతుంది. ఎందుకంటే వాళ్లు దేవుడిలా ఆరాధించే ఎంజీఆర్ సినిమాలో ఒక పాట పల్లవి ఇదే మాటతో మొదలవుతుంది. ఆ పాట తమిళంలో సూపర్ పాపులర్.

దాన్నే తన సినిమాకు టైటిల్‌గా ఎంచుకోవడం రానాకు కలిసొచ్చేదే. ఈ టైటిల్ ఈజీగా జనాల్లోకి వెళ్లిపోయే అవకాశముంది. కాజల్.. కేథరిన్ కథానాయికలుగా నటించడం కూడా ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు. తేజ రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. రానా తండ్రి సురేష్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు