కోన వెంకట్.. ఊపిరి తీసుకున్నాడు

కోన వెంకట్.. ఊపిరి తీసుకున్నాడు

గత రెండు దశాబ్దాల్లో త్రివిక్రమ్ తర్వాత టాలీవుడ్లో రచయితగా అంత పేరు సంపాదించింది ఎవరంటే మరో మాట లేకుండా కోన వెంకట్ పేరు చెప్పేయొచ్చు. తెలుగులో ఓ రైటర్‌కు కోటి రూపాయల పారితోషకం ఇవ్వడం కోన విషయంలోనే జరిగింది. శ్రీను వైట్లతో కలిసి అనేక బ్లాక్ బస్టర్లకు పని చేసి.. బయటి దర్శకులకు కూడా సూపర్ హిట్లు ఇచ్చి రచయితగా తిరుగులేని స్థాయిని అందుకున్నాడు కోన.

కానీ గత మూణ్నాలుగేళ్ల నుంచి కోనకు అసలేమాత్రం కలిసి రావట్లేదు. వరుసబెట్టి ఆయన్నుంచి డిజాస్టర్లు వచ్చాయి. బ్రూస్ లీ, అఖిల్ లాంటి సినిమాలు కోన ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. దీనికి తోడు ప్రొడక్షన్లో వేలు పెట్టి ఎదురు దెబ్బలు తిన్నాడాయన. సాహసం శ్వాసగా సాగిపో.. అభినేత్రి సినిమాలు ఆయనకు నిర్మాతగానూ చేదుఅనుభవాన్ని మిగిల్చాయి.

ఐతే కోనకు చాన్నాళ్ల తర్వాత రచయితగా.. నిర్మాతగా ఊరట లభించింది. నాని సినిమా 'నిన్ను కోరి' కోనకు ఆనందాన్ని మిగిల్చేలా ఉంది. ఈ సినిమాకు కోన స్క్రీన్ ప్లే రాయడంతో పాటు మాటలు కూడా అందించాడు. అలాగే సహ నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాలో కోన మార్కు డైలాగులు బాగానే పేలాయి. ''దమ్ బిరియాని ఎవ్వడైనా షేర్ చేసుకుంటాడు.. కానీ దరిద్రాన్ని కూడా షేర్ చేసుకునేవాడే ఫ్రెండు''.. ''నువ్వు నా లైఫ్‌లో వేలెడితే.. నేను నీ లైఫ్‌లోకి కాలెట్టేస్తా''.. ''ఫస్ట్ టైం ఇలా చూడటం.. ఓ కొండను ఇంకో కొండ ఎక్కడం..'' లాంటి పంచ్ డైలాగులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

'నిన్నుకోరి' సీరియస్ సినిమానే అయినప్పటికీ.. అక్కడక్కడా కోన మార్కు వినోదం సినిమాకు ప్లస్ అయింది. ఈ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ కూడా మాటలు అందించాడు. కానీ అతను ప్రధానంగా సీరియస్ డైలాగులే రాసినట్లున్నాడు. వినోదం బాధ్యత కోన తీసుకున్నట్లున్నాడు. ఆయన అనుభవం సినిమాకు బాగానే పనికొచ్చింది. మొత్తానికి కోన రచయితగా.. నిర్మాతగా ఒకేసారి ఓ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకునేట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English