ఎన్టీఆర్‌‌పై సెటైర్.. పొగడ్త

ఎన్టీఆర్‌‌పై సెటైర్.. పొగడ్త

నందమూరి అభిమానులకు కోపం వస్తే రావచ్చు గాక.. కానీ 'టెంపర్' ముందు వరకు ఎన్టీఆర్ ఎలాంటి రొడ్డ కొట్టుడు సినిమాలు చేశాడో తెలిసిందే. ఓవైపు తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారి.. కొత్త తరహా సినిమాలకు పట్టం కడుతున్నా.. అతను మాత్రం మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ సాగాడు. మిగతా హీరోలు కొత్త కథల వైపు అడుగులేస్తుంటే అతను మాత్రం మార్పు చూపించలేకపోయాడు.

దీంతో వరుసబెట్టి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఐతే 'టెంపర్'తో అతడి దశ తిరిగింది. అక్కడి నుంచి వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమా సినిమాకూ తన రేంజ్ పెంచుకుంటూ సాగుతున్నాడు. తన కొత్త సినిమా 'జై లవకుశ'లోనూ తారక్ భిన్నమైన పాత్ర చేస్తున్నాడని టీజర్ చూస్తేనే అర్థమైంది.

ఈ టీజర్ గురించి స్పందిస్తూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మూస గొలుసులు తెంచుకున్న 'మాస్' పులి కళ్ళతోనే వేటాడుతుంది'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఇంతకుముందు మూస సినిమాలు చేశాడంటూ రామజోగయ్య శాస్త్రి మొహమాటం లేకుండా సెటైర్ వేసేశారు. అలాగని ఎన్టీఆర్ విలువ ఏమీ తగ్గించేయలేదాయన.  ''ఎంట్రీలో ఆ చూపు.. మాటలో నత్తి.. చివర్లో ఆ నవ్వు.. సరైన ఆహారం దొరికితే పులి అట్టాగే విజృంభిస్తుంది'' అన్నారాయన.

రామజోగయ్య వ్యాఖ్యలతో అందరూ ఏకీభవించాల్సిందే. తన స్టామినా ఏంటో తెలియకుండా రొటీన్ సినిమాలతో విసుగెత్తించాడు తారక్. కానీ ఇప్పుడు తన స్థాయికి తగ్గ వైవిధ్యమైన పాత్రలు.. సినిమాలు చేస్తూ చెలరేగిపోతున్నాడు. తారక్ ఇలాగే దూసుకెళ్తే మిగతా హీరోలందరూ సైడిచ్చేయాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు